మా మాట వినాల్సిందే
ఇన్నాళ్లూ జరిగిందేదో జరిగింది.. ఇక ఊరుకునేది లేదు
కాంగ్రెస్ నేతలకు కార్యకర్తల ఝలక్
బీటలు వారుతున్న కంచుకోటలు
సాక్షి, ఒంగోలు :
కుడిఎడమైతే పొరబాటు లేదోయ్..! అంటూ రాజకీయనేతలు ఇష్టానుసారంగా పార్టీలు మారితే.. తానా తందానా అనేందుకు మేమేమైనా చిన్నపిల్లలమా..? ఎల్లకాలం నాయకుడి మాటే వింటే.. మాకు గుర్తింపు ఇచ్చేవారెవరు? అందుకే ఇక నుంచి నాయకుడు మేం చెప్పింది వినాల్సిందేనని కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబట్టారు. రాజకీయ దిగ్గజాలకు నెలవైన జిల్లాలో ముందెన్నడూ ఎరుగని రీతిగా కార్యకర్తల్లో రాజకీయ చైతన్యం కనిపిస్తోంది.
ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా అంధకారమైంది. నిన్నటిదాకా అధికారపగ్గాలు పట్టి హల్‌చల్ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. నేడు నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయాలపైనే ఆధారపడి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు స్థానికంగా ఊహించని అవమానాలెదుర్కొంటున్నారు.
కేడర్‌లో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో నేతలు ఖంగుతింటూనే, రాజకీయ భవిష్యత్‌కు వారు చెప్పిన బాటలోనే నడవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి మార్గాలు లేని కొందరు నేతలు రాజకీయ సన్యాసం ప్రకటించి పెద్దరికం నిలుపుకునేందుకు పాట్లు పడుతుండగా, మరికొందరేమో పార్టీ మారే విషయంలో ఊగిసలాడుతూ నిర్ణయాల్ని వాయిదా వేస్తున్నారు. మొత్తానికి జిల్లాలో కాంగ్రెస్ జెండా పట్టుకునే వారే కరువయ్యారని చెప్పాలి.
నాడు వెలిగిన ‘కోట’కు బీటలు జిల్లా రాజకీయాలు భిన్న శైలిలో నడుస్తాయి. ఇక్కడ అత్యధిక సీట్లు ఏపార్టీ అయితే గెలుచుకుంటుందో.. వినాల్సిందే
రాష్ట్రంలో అధికార పగ్గాలు కూడా అదేపార్టీ పట్టుకుంటుందని రుజువులయ్యాయి. ఆ మేరకే 2009లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లాలో కాంగ్రెస్ భారీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 10 చోట్ల కాంగ్రెస్ గెలుపొంది కంచుకోటగా నిలిచింది. అలాంటిది, నేడు జిల్లాలో పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా ఆదరణ పెరగడం.. రాష్ట్రవిభజన నిర్ణయంతో మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అగాథంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ఆర్ హఠాన్మరణం తర్వాత ఆయన తనయుడు నెలకొల్పిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి దశలవారీగా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి, అద్దంకి ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, గొట్టిపాటి రవికుమార్ చేరగా.. తాజాగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గుంటూరు జిల్లా ఓదార్పులో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
రాష్ట్రవిభజన చేసిన కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని కార్యకర్తల సూచనమేరకు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. తాజాగా పార్టీకీ గుడ్‌బై చెప్పారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేల రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమైంది. కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం జిల్లావంక కన్నెత్తయినా చూడని పరిస్థితి ఉంది.
కేడర్ వెంటే నేతలు:పార్టీ మారే ఆలోచనలో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశాలు పెట్టి అభిప్రాయసేకరణ చేస్తున్నారు. భవిష్యత్‌లో సపోర్టుకు వారి అభిప్రాయం తప్పనిసరనే వ్యూహంతో నేతలు ప్రయత్నిస్తుండగా.. కేడర్ నుంచి ఊహించని అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు పెట్టి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
మరోవైపు మాజీ మంత్రి ఎం.మహీధర్‌రెడ్డి సైతం భవిష్యత్ కార్యాచరణపై చర్చించగా.. మెజార్టీ అనుచర వర్గమంతా ఆయన్ను వైఎస్‌ఆర్ సీపీ వైపు వస్తేనే మనుగడ ఉందని తేల్చి చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచికి కూడా అదే పరిస్థితి ఎదురవడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి తాజాగా జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించగా కేడర్‌లో తీవ్ర వ్యతిరేక వచ్చి ఆయన్నెవరూ కలవడం లేదని తెలిసింది.