
‘అసెంబ్లీ తీర్మానం’ భావమేమి?
దిగ్విజయ్, షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే విస్మయం
బాధ్యత నుంచి తప్పుకునేందుకేనని అనుమానాలు
వైఎస్సార్‌సీపీని ఎలాగైనా ఇరుకున పెట్టడమే లక్ష్యం?
అసెంబ్లీలో వేసింది రోశయ్య కమిటీ మాత్రమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం విషయంలో కాంగ్రెస్ నాయకత్వం పొంతన లేని ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తోంది. తీవ్రమైన సమస్యను మరింత జటిలం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న అనుమానాలు పీసీసీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. తెలంగాణపై రాష్ట్ర అసెంబ్లీ గతంలోనే తీర్మానం చేసిందంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చేసిన ప్రకటనలు తీవ్ర అయోమయం సృష్టిస్తున్నాయి. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతుండటం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి గందరగోళ ప్రకటనలు చేస్తున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు జరిగిందంటూ కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు! తెలంగాణపై అసెంబ్లీలో ఒకట్రెండుసార్లు చర్చ జరిగినా తీర్మానమేదీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. అయినా ‘తీర్మానం జరిగింద’ంటూ కేంద్ర పెద్దలు కావాలనే తప్పుదోవ పట్టించజూస్తున్నట్టు కనబడుతోందని అభిప్రాయపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీయే లక్ష్యం!
తెలంగాణపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తర్వాత రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తీర్మానంపై అసెంబ్లీలో అసలు సజావుగా చర్చయినా జరుగుతుందా, లేదా అన్న అనుమానాలున్నాయి. ఇలాంటి సమయంలో, ‘అసెంబ్లీలో ఇదివరకే తెలంగాణపై తీర్మానం జరిగింది’ అన్నట్టుగా ఢిల్లీ ముఖ్యులు పదేపదే మాట్లాడుతుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్ ఏకపక్షంగా తీసుకోలేదని, దానిపై అసెంబ్లీ ఇదివరకే తీర్మానం చేసిందనడం ద్వారా నెపాన్ని ఇతరులపైకి నెట్టడమే ఉముఖ్యోద్దేశంగా కన్పిస్తోందంటున్నారు. అందుకే వారు తెలంగాణ అంశానికి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ముడిపెట్టేలా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రకటన చేస్తున్నారని చెబుతున్నారు. వైఎస్ హయాంలోనే తెలంగాణపై తీర్మానం చేశారనే ప్రచారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం వారి లక్ష్యమని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.
అసలేం జరిగింది
తెలంగాణ అంశంపై 2001 అక్టోబర్ 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానం మొదలుకుని ఇప్పటిదాకా జరిగిన ఏ సందర్భంలోనూ తీర్మానమనే ప్రస్తావనే ఎక్కడా కన్పించదు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో 2001లో ఓ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ, విదర్భ రాష్ట్రాల డిమాండ్లతో పాటు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ ఏర్పాటే మార్గమని అది సూచించింది. ఆ మేరకు 2001లో సీడబ్ల్యూసీలోనే కాంగ్రెస్ తీర్మానం చేసింది. దాన్నే అప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి పంపింది. రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తీర్మానంలో స్పష్టం చేసింది. తర్వాత 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.
మొదటి ఎస్సార్సీని గౌరవిస్తూ... విదర్భ, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు సబబైన కారణాలు కనిపిస్తున్నాయని, వీటితో పాటు ఇతర మరిన్ని డిమాండ్లు కూడా ఉన్న తరుణంలో రెండో ఎస్సార్సీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని పేర్కొంటూ టీఆర్‌ఎస్‌తో పొత్తుల ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రంపై నాటి టీఆర్‌ఎస్ ముఖ్యనేత ఆలె నరేంద్ర సంతకం చేశారు. తరవాత తెలంగాణ అంశం పరిష్కారానికి రెండో ఎస్సార్సీ ఏర్పాటును 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించింది. సంప్రదింపులు, ఏకాభిప్రాయ సాధనతో తెలంగాణను ఏర్పాటు చేస్తామని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కనీస ఉమ్మడి ప్రణాళికలోనూ పొందుపరిచింది. సంప్రదింపులు చేసి సరైన సమయంలో తెలంగాణను ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు.
రోశయ్య నేతృత్వంలో కమిటీ
2009 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తెలంగాణపై ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే ఆ విషయంలో ముందుగా భాగస్వాములందరితో విస్తృత సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు. తెలంగాణపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని, అంతకు ముందు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల అభ్యంతరాలను, ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరముందని చెప్పారు. ఇందుకోసం ఉభయసభల సభ్యులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నాడు నిండు సభలో వైఎస్ స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేశారు. ‘‘టీడీపీ అధికారంలో ఉండగా అభివృద్ధి అసాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భావించారు. అందుకే సోనియాగాంధీని కలసి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేశారు. అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం వద్ద రెండో ఎస్సార్సీ ప్రతిపాదన చేయగా అది తిరస్కరించింది. 2001లోనే సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణపై ఏకాభిప్రాయానికి ప్రణబ్‌ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏకాభిప్రాయానికి ప్రయత్నించినా సాధ్యంకాలేదు. కొన్ని పార్టీలు మద్దతివ్వడానికి నిరాకరించాయి. ముస్లిం మైనార్టీలు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తమ భద్రతకు ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించాలి. 60 ఏళ్లుగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉన్నందునే ఇక్కడ స్థిరపడ్డామని కోస్తా, రాయలసీమ ప్రజలు అంటున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు, మూడు, నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్లూ వస్తున్నాయి. సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా రాష్ట్రాలు ఏర్పాటుచేయాలని అంటున్నారు.
ఈ సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ఏర్పాటుకు తీసుకోవలసిన చర్యలను సూచించడానికి అసెంబ్లీ, శాసనమండలి సభ్యులతో సంయుక్త కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఈ సంయుక్త కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత దాని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది’’ అని ఆయన వివరించారు. అంతే తప్ప ఆనాడు సభలో ఎలాంటి తీర్మానమూ జరగలేదు. తరవాత అప్పటి ఆర్థిక మంత్రి కె..రోశయ్య అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి టీడీపీ స్పందించలేదు. వామపక్షాలు, బీజేపీ, టీఆర్‌ఎస్ దూరంగా ఉన్నాయి. 2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య అఖిలపక్షాన్ని నిర్వహించి తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. సీపీఎం, ఎంఐఎం మినహా తక్కిన పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందని, ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని పేర్కొంటూ డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రకటన చేశారు.
దానిపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు రావడంతో, ‘పార్టీలు రెండుగా విడిపోయినందున దీనిపై మరింత విస్తృత స్థాయిలో చర్చలు చేయాల్సి ఉంద’ంటూ డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. 2010 ఫిబ్రవరి 3న కేంద్రం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసింది. తరువాత కేంద్ర హోం శాఖ రెండుసార్లు అఖిలపక్షాన్ని నిర్వహించింది. షిండే హోం మంత్రిగా చివరిసారిగా అఖిలపక్షాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధులిద్దరూ హాజరై వాదన విన్పించారు. అయితే తెలంగాణ ప్రతినిధి వాదననే పార్టీ వాదనగా తీసుకుంటున్నట్టు షిండే పేర్కొన్నారు. ఈ పరిణామ క్రమంలో ఎక్కడా ‘అసెంబ్లీలో తీర్మానం, చర్చ, ఆమోదం’ అనే అంశాలే కానరావు. అయినా ‘అసెంబ్లీలో తీర్మానం జరిగింది’ అన్నట్టుగా దిగ్విజయ్, షిండే పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు!