
బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణల్లోని బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు.
బీసీ రాష్ట్రవ్యాప్త సదస్సులో నేతలు
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తీర్మానాలు
మహిళలకు 50శాతం రిజర్వేషన్లపై చర్చ
సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణల్లోని బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ జె. చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఆదివారం ‘రాష్ట్ర కాంగ్రెస్-వెనుకబడిన తరగతుల సదస్సు’ జరిగింది. కార్యక్రమంలో ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు కె.సి. లెంక మాట్లాడుతూ.. బీసీలకు పెద్దపీట వేయడమే కాంగ్రెస్ సంకల్పమన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రానున్న ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాలపైనే చర్చించారన్నారు. బీసీలకు టికెట్లు కేటాయింపులో పీసీసీ అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకునేలా జాబితా రూపొందించాలని రాహుల్ సూచించినట్టు తెలిపారు.
అందరికీ న్యాయం: పొన్నాల
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు మేలు జరిగేలా మ్యానిఫెస్టోలో పలు పథకాలు పొందుపరుస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ప్రభుత్వ నియామకాల్లో బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, బీసీ విద్యార్థులకు ఉచిత విద్య, ప్రత్యేక మోడల్ స్కూళ్లు, 25 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ అమలు, జిల్లాల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు బీసీలకు 50 శాతం అమలు వంటి తీర్మానాల్ని వేదికపై ప్రకటించారు.
త్వరలో కొత్త చైర్మన్లు
ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికీ బీసీ సెల్ చైర్మన్లను త్వరలోనే నిర్మిస్తామన్నారు. బీసీలకు భరోసా ఇవ్వడానికే కె.సి.లెంక వచ్చారన్నారు. దళితుడిని సీఎం చేసిన ఘనత, పీసీసీ అధ్యక్ష పదవుల్ని బీసీలకు కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఇతర పార్టీ నాయకులు అలా చేయగలరా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని బీసీలకు ఆసక్తి ఉంటే తనను సంప్రదించ వచ్చన్నారు. ఇదిలావుంటే, విపక్షాల మాయ మాటల్ని నమ్మొద్దని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు.