రండి.. రండి.. కోట్లకు ఆహ్వానం!
*టీడీపీలోకి రావాలని కోట్లకు లోకేష్ ఆహ్వానం
*ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు
*ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవీ
* ఇస్తామంటూ బేరసారాలు
* రాబోయే ఎన్నికల్లో ఒక ఎంపీ,
* రెండు ఎమ్మెల్యే సీట్లకు హామీ
*ససేమిరా అంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి?
కర్నూలు: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులను పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు రాఘవేంద్రారెడ్డితో పలు దఫాలుగా హైదరాబాద్‌లో భేటీ అయినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి వస్తే... జిల్లాలో పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని కూడా ఆశ చూపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అవసరమైతే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కోట్ల రాఘవేంద్ర ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, తెలుగుదేశం పార్టీలోకి చేరేది లేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.
కోట్ల చేరితే...
దివంగత కోట్ల విజయభాస్కర రెడ్డి కేంద్ర మంత్రిగా, రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో ఆయన కుటుంబానికి మంచి పేరు ఉంది. జిల్లా ప్రజలు ఆయన్ను ముద్దుగా ‘పెద్దాయన’ అని పిలుస్తుంటారు. అలాంటి కుటుంబాన్ని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలనేది నారా లోకేష్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అయితే, తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉందని... వేరే పార్టీలోకి వెళ్లేది లేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్టు సమచారం.
అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు పట్టువదలడం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే మంచి ఓట్లు దక్కాయి. కోట్ల కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పార్టీ పటిష్టతకు కోట్ల కుటుంబం చేరితే మంచి ఊపు వస్తుందనేది నారా లోకేష్ ఆలోచన. ఇందులో భాగంగా ఆయన కేంద్ర మంత్రి సుజనాచౌదరిని కూడా రంగంలోకి దించినట్టు సమాచారం. ఏదైమైనప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
మా నాయకుడు వెళ్లడు..తెలుగుదేశం పార్టీలోకి కోట్ల కుటుంబం చేరికపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం రాష్ట్రస్థాయి నేతలు మాత్రం తమ పార్టీలోకి మరికొన్ని రోజులకైనా వస్తాడని అంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు. తమ నేత ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేరరని స్పష్టం చేస్తున్నారు. అయితే, టీడీపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారనే వార్తలను మాత్రం వీరు అంగీకరిస్తుండటం గమనార్హం.
'మా నేతను తమ పార్టీలోకి చేరమని తెలుగుదేశం నేతలు పైస్థాయిలో చర్చలు జరిపిన మాట వాస్తవం. ఆయన మాత్రం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ మా నేత వెళ్లే ప్రసక్తే లేదు' అని కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. అయితే, కోట్ల-కేఈ కుటుంబాల మధ్య ఉన్న దీర్ఘకాల వైరుధ్యాల నేపథ్యంలో టీడీపీలోకి కోట్ల ఒకవేళ వచ్చినా... కేఈ వర్గీయులు అంగీకరిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది.