నోళ్లల్ల ఏం పెట్టుకున్నరు? | congress leaders announced the establishment process will not occur nowadays | Sakshi
Sakshi News home page

నోళ్లల్ల ఏం పెట్టుకున్నరు?

Published Fri, Sep 20 2013 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

congress leaders announced the establishment process will not occur nowadays

 కరీంనగర్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తూ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇప్పట్లో జరగదని ప్రకటిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు నోళ్లు మెదపడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. తమ వల్లే తెలంగాణ ప్రటకన వచ్చిందంటున్న వారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
 
 గురువారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కమిటీలు, ఏకాభిప్రాయాలంటూ జాప్యం చేయడం తగదని, మరోసారి వంచనకు గురిచేస్తే కాంగ్రెస్ పార్టీని పాతరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర పార్టీలన్నీ ఏకమయ్యాయని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్న సీమాంధ్ర పార్టీల జెండాగద్దెలను కూల్చివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఏకే.అంటోనీ, అహ్మద్‌పటేల్, వీరప్పమొయిలీ సీమాంధ్ర ఉద్యమానికి వంతపాడుతున్నారని, ఏకాభిప్రాయ సాధన వచ్చిన తరువాతే రాష్ట్ర విభజన ప్రక్రియ ఉంటుందనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ అంశాన్ని సస్పెన్స్‌లో పెడుతూ ప్రజలను తికమక చేయొద్దని, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర కృత్రిమ ఉద్యమానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తెలంగాణలో అంతర్భాతమైన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకేనే ప్రసక్తే లేదన్నారు. ఈనెల 29న టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తలపెట్టిన బహిరంగసభకు తెలంగాణవాదులు అధికసంఖ్యలో హాజరై సత్తా చాటాలని కోరారు.
 
 సీల్డ్‌కవర్ సీఎం అహంభావం వద్దు
 తెలంగాణ ప్రాంత సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మొండిగా వ్యవరిస్తున్నారని, సీల్డ్‌కవర్ సీఎంకు అంత అహంభావం తగదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని, పంటనష్టం ఊసేలేదని, వరదల నష్టం అంచనా అతీగతీ లేదని అన్నారు.
 
 సీమాంధ్ర ప్రాంతంలో స్పెషల్ ప్యాకేజీలు ఉంచుకుంటున్న ముఖ్యమంత్రి తెలంగాణలో పింఛన్లు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. వరద నష్టం నివేదికలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నాయకులు కట్ల సతీష్, అక్బర్‌హుస్సేన్, రఘువీర్‌సింగ్, లక్కాకుల మోహన్‌రావు, గుంజపడుగు హరిప్రసాద్, అనంతుల రమేష్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement