విజయోత్సాహం.. | Congress leaders tried for credit | Sakshi
Sakshi News home page

విజయోత్సాహం..

Published Sat, Dec 7 2013 1:11 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Congress leaders tried for credit

సాక్షిప్రతినిధి, నల్లగొండ:  అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ర్ట్ర ఏర్పాటుకు కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమై, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో నిజంగానే జిల్లాలో  ఉద్యమంతో మమేకమైన నాయకులు ఎవరన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశానంతరం  హోంమంత్రి షిండే ప్రకటన చేశాక జిల్లా వ్యా ప్తంగా సంబరాలు జరిగాయి.  ఎవరికి వారు తాము చేసిన రాజీనామాల వల్లే  ఏర్పడిందని ప్రకటనలు కూడా ఇచ్చారు. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్‌లో పలువురు ఎమ్మెల్యేలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు.

మరికొం దరు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో అంటకాగారు. సీఎం కిరణ్ పూర్తిస్థాయిలో సమైక్యవాదాన్ని బాహాటంగా వినిపిస్తున్నారని తెలిసీ ఆయనతో తమ నియోజకవర్గాల్లో పర్యటనలు ఏర్పాటు చేశారన్న అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఇక, అధికారిక పదవుల్లేని నేతలు సైతం కొందరు సీఎం వర్గంగా పిలిపించుకునేందుకు తెగ తాపత్రయపడ్డారు. జిల్లా కాంగ్రెస్‌లో జరిగిన పరి ణామాలతో తెలంగాణ ఉద్యమ సమయంలో విభిన్న దృశ్యమే ఆవిష్కతమైంది. అటు జేఏసీ,  ఇటు తెలంగాణవాద పార్టీలు చేపట్టిన ఆందోళనల్లో పూర్తిస్థాయిలో పాల్గొన్న నేతలు, అంటీముట్టనట్టు వ్యవహరించిన నేతల తీరును విశ్లేషిస్తే.. అసలు కాంగ్రెస్‌లో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనే అంశం ఇట్టే అర్థమవుతుందంటున్నారు.
  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల్లో.. పూర్తిస్థాయిలో మమేకమైన నేతగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే ఎక్కువ క్రెడిట్ దక్కుతోందంటున్నారు. 2009 డిసెంబరు 9 ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకున్నాక తెలంగాణ వ్యాప్తంగా మొన్న మొన్నటి దాకా ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో సాగిన ఉద్యమంలో జిల్లాకు ముఖ్యమైన స్థానమే ఉంది. మలి ఉద్యమంలో తొలి అమరుడిగా గుర్తింపు ఉన్న శ్రీకాంతాచారి ఆత్మబలిదానం తర్వాత మరి కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని  అధిష్టానానికి గడువు పెట్టి, ఆతర్వాత తన మంత్రి పదవికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. అయితే, సొంత పార్టీలో కొనసాగుతూనే తెలంగాణవాదాన్ని బలంగా వినిపించి తెలంగాణ వ్యాప్తం గా గుర్తింపు పొందారు. చివరకు జిల్లా కేంద్రం లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తర్వాత కూడా తెలంగాణ కోసం జరిగిన ప్రతీ ఉద్యమంలో ముందుండి నడిచారు.
 ఎంపీలు..
 జిల్లాకు చెందిన ఎంపీల్లో  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచీ తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. తమ అధినేత్రి సోనియాగాంధీపై విశ్వాసం ఉందని చెబుతూనే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేశారు. ‘దేశ పార్లమెంటు చరిత్రలో అధికార పార్టీకి చెందిన ఎంపీలమై ఉండి సస్పెండ్ అయ్యాం. కేవలం తెలంగాణ సాధన కోసమే అధిష్టానంపై కొట్లాడాం. చివరకు కల నెరవేరుతోంది. తెలంగాణ ప్రజల ఆంకాక్షను నెరవేస్తున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు..’ అని ఎంపీ రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మరో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం తెలంగాణవాదాన్ని వినిపిస్తూనే, సీఎం కార్యక్రమాల్లోనూ వేదికలను పంచుకున్నారు. జిల్లాలో జరిగిన సీఎం పర్యటనలను కోమటిరెడ్డి సోదరులు బహిష్కరించగా, సుఖేందర్‌రెడ్డి మా త్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సీఎంకు వ్యతిరేకంగా, సమైక్యవాదులకు వ్యతిరేకంగా మీడియా ఎదుట ప్రకటనలకే పరిమితం కాగా, క్షేత్రస్థాయి ఆందోళనల్లో పాల్గొన్నది లేదు.  
 మంత్రులు..
 మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. మంత్రి జానారెడ్డి తెలంగాణ జేఏసీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆచితూచి అడుగేసే జానా ఎన్నడూ అధినాయకత్వాన్ని కాదనే రీతిలో వ్యవహరించలేదు. మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 610 జీఓ అమలు కమిటీ  చైర్మన్‌గా, కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం సమావేశాల్లో ప్రతినిధిగా పాల్గొన్నా మూడు నాలుగు నెలల కిందటి దాకా తెలంగాణ గురించి బలంగా, బహిరంగంగా వాదించింది లేదు. నిజాం కాలేజీ మైదానంలో నిర్వహించిన కాంగ్రెస్ తెలంగాణ సాధన సభ తర్వాతి నుంచే తెలంగాణ సభా వేదికలపై కనిపిస్తున్నారు. సీమాంధ్ర మంత్రులు, సీఎంతో తన నియోజకవర్గంలో పర్యటనలు పెట్టించారన్న అసంతృప్తి తెలంగాణవాదుల్లో ఉంది.
 ఎమ్మెల్యేలు..
 తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులనే అనుసరించారు. వెంకట్‌రెడ్డితో పాటు రాజీనామా చేశారు. వెంకట్‌రెడ్డితో పాటు కలిసి వివిధ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బాలూనాయక్, భిక్షమయ్యగౌడ్‌లు తెలంగాణవాదాన్ని వినిపిం చినా, అధిష్టానానికి వ్యతిరేకంగా ఏ పనులూ చేయలేదు. ఇక, సీనియర్ ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి మొదట్లో వినిపించినంత బలంగా తెలంగాణవాదాన్ని వినిపించలేకపోయారన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది.  తన తనయుడి రాజకీయ అరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం దృష్టిలో పడేందుకు కావాల్సినంత సంయమనాన్ని పాటించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన పెట్టించి, ఆ సభా వేదికపై కనీసం జై తెలంగాణ  నినాదం కూడా చేయకుండా ఉండిపోయారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement