సాక్షి, రాజమండ్రి :
పెద్దాయన కష్టంతో పునర్జన్మ పొందిన కాంగ్రెస్ పార్టీ నేడు జీవచ్ఛవంగా మారిపోయింది. జిల్లాలో పూర్తిగా కుప్పకూలిపోయింది. పుర సమరంలో ఎక్కడా పత్తా లేకుండా పోయింది. పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఇంతటి హీన స్థితి పార్టీకి కలిగి ఉండదని ఆ పార్టీ పెద్దలే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం ఇలా చుట్టుకుందంటున్నారు. ఇక్కడ గెలిస్తే ఇక అంతటా గెలిచినట్టేనని జిల్లాపై అన్ని పార్టీలకు గురి.
మొన్న పుట్టిన జై సమైక్యాంధ్ర పార్టీ కూడా తొలి సభ రాజమండ్రిలో నిర్వహించి తొలి అడుగు వేసింది. పార్టీల విజయాలకు తొలి మెట్టుగా నిలిచే జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ మాత్రం పట్టుకోల్పోయింది. రానున్న శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరవయ్యారు. రాజమండ్రిలో పార్టీకి కార్పొరేటర్ అభ్యర్థులు కరువయ్యారు. తుని తప్ప జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది.
నాటి చరిత్ర ఘనం
ఎన్‌టీఆర్ ప్రభంజనంతో 1984లో కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో చావు దెబ్బతింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2003లో పాదయాత్ర చేసి పార్టీకి ప్రాణం పోశారు. 2004 ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుని, పిఠాపురం మినహా 16 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన బోస్ కాంగ్రెస్ గూటికే చేరారు.
2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనాన్ని కాంగ్రెస్ కొనసాగించింది. 2009లో మహానేత మరణంతో మళ్లీ పార్టీకి పతన దశ ప్రారంభమైంది. అది ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది.