ముఖం చాటేశారు.. | congress MLAs not met with AICC personal assistance | Sakshi
Sakshi News home page

ముఖం చాటేశారు..

Published Mon, Jan 20 2014 2:46 AM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM

congress MLAs not met with AICC personal assistance

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధిష్టానం రానున్న సాధారణ ఎన్నికల  సన్నాహకంగా వేసిన మొదటి అడుగే తడబడింది. పార్లమెంట్ స్థానాల వారీగా అభ్యర్థుల ఎంపిక కోసం చేపట్టిన అభిప్రాయ సేకరణ ఒంగోలులో చప్పగా సాగింది. రెండు రోజులుగా స్థానిక డీసీసీ కార్యాలయంలో మకాం వేసిన రాహుల్‌గాంధీ దూతలకు ఆశించిన మేర స్పందన లభించలేదు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌కు అభ్యర్థిగా మెడలో గంట కట్టించుకునేవారే కరువయ్యారు.

 నాలుగు రోజుల క్రితమే ఏఐసీసీ దూతలుగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే బసవరాజు, పీసీసీ నుంచి నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సి.వి.శేషారెడ్డిలు వస్తున్నారని చెప్పినా.. ముఖ్యనేతలెవరూ వారికి ముఖం చూపించేందుకు ఇష్టపడలేదు. పార్లమెంట్‌తో పాటు, పనిలో పనిగా దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు  అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ, బయోడేటాలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు.

 ఎంపీ నగరంలో ఉన్నా..
 ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నగరంలో ఉన్నా, డీసీసీ కార్యాలయంలో మకాం వేసి ఉన్న దూతల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మొదటి రోజు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండోరోజు ఒంగోలు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభిప్రాయాలు సేకరించారు. అయితే ఎంపీ మాగుంట మాత్రం పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ విజయకుమార్‌తో కలిసి డీసీసీ కార్యాలయం మీదుగానే వెళ్లారు. కానీ అక్కడ ఆగకుండా వెళ్లిపోయారు.  

 నలుగురు ఎమ్మెల్యేల్లో  ఒక్కరు మాత్రమే హాజరు..
 ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో నలుగురు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుండగా ఇద్దరు వైఎస్సార్‌సీపీ, ఒక టీడీపీ ఎమ్మెల్యే. అయితే ఆ నలుగురిలో కొండపి ఎమ్మెల్యే జి.వి.శేషు మాత్రమే ఆదివారం ఏఐసీసీ దూతల ముందు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో తనకే కొండపిలో పార్టీ టికెట్ ఇవ్వాలని దూతలకు బయోడేటా పత్రాన్ని స్వయంగా అందించారు.

 అయితే మొదటిరోజు శనివారం జరిగిన అభిప్రాయ సేకరణకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరు అన్నా రాంబాబు, యర్రగొండపాలెం ఆదిమూలపు సురేష్‌లు ముఖం చాటేశారు. కాకపోతే మొక్కుబడిగా తమ అనుచరులను కొంత మందిని దూతల వద్దకు పంపి మ... మ... అనిపించారు.

 ఇకపోతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒంగోలుకు వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి తాజా మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీకి చెందిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలు కాగా, మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కనీసం ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఏఐసీసీ దూతల వద్దకు రాలేదు.

 ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు పార్టీ తరఫున ఏ ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలుపుతూ ముందుకు రాలేదు. కాని ఏడు అసెంబ్లీ స్థానాల తరఫున తాము పోటీ చేస్తామంటూ ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థాయి నాయకులు తమ అనుచరులతో  వచ్చి దూతలకు దరఖాస్తులిచ్చారు. ప్రథమశ్రేణి నేతలు ఎలాగూ ముందుకు రావడం లేదు కాబట్టి, కనీసం ఎమ్మెల్యే కాకపోయినా, శాసనసభకు పోటీ చేశామన్న కోరిక నెరవేర్చుకునేందుకు ముందుకొచ్చారు.

 ఒంగోలు అసెంబ్లీకి...
 ఒంగోలు శాసనసభా నియోజకవర్గానికి దాదాపు 20 మందికిపైగా బయోడేటాలు అందించారు. వారిలో ప్రధానంగా  పార్టీ నగర అధ్యక్షుడు జడా బాలనాగేంద్రం, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్‌లు మొదటి వరుసలో ఉన్నారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, గొర్రెపాటి శ్రీనివాసరావు, తాతా ప్రసాద్, మంత్రి శ్రీనివాసరావు, వేమా శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ కండే శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, బంకా చిరంజీవి, ఈదా సుధాకరరెడ్డి, వాకా కృష్ణారెడ్డి, కుసుమకుమారితో పాటు పలువురు బయోడేటా ఇచ్చిన వారిలో ఉన్నారు.

 కొండపిలో...  
 కొండపిలో ఎమ్మెల్యే జీవీ శేషుతో పాటు, ఆయన తనయుడు విమల్‌రాజ్, ఎద్దు శశికాంత్ భూషణ్, చుండి దేవదాసు, బిల్లా చెన్నయ్య, నాళం నరసమ్మ, శ్రీపతి ప్రకాశం, కండె శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది బయోడేటా అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement