
లాటరీలో గెలిచిన ఎమ్మెల్సీ నర్సారెడ్డి
న్యూఢిల్లీ : టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డికి ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కేసులో ఆయన ఎన్నిక సక్రమమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టులోనే న్యాయమూర్తులు లాటరీ తీయటంతో నర్సారెడ్డి గెలుపొందగా, వెంకటరామిరెడ్డి ఓడిపోయారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన నర్సారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 2009లో గెలుపొందినట్టు ప్రకటించారు. అయితే ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో మూడు ఓట్లు వివాదాస్పదంగా మారాయని, మూడు ఓట్లు కూడా వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా పడ్డవేనని కేసును విచారించిన న్యాయస్థానం తీర్పునిచ్చింది.
అయితే ఆ తీర్పును ఎమ్మెల్సీ నర్సారెడ్డి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓట్ల లెక్కింపులో ముందుగా వివాదాస్పదంగా మారిన మూడు ఓట్లను లెక్కించి, మిగిలిన ఓట్లను తర్వాత లెక్కించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ సమక్షంలో ఓట్లను లెక్కించగా వెంకట్రామిరెడ్డికి తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది. కేసులో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం టిడిపి అభ్యర్థి నర్సారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు తీర్పు నిచ్చింది. అయితే దానిపై కూడా నర్సారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో లాటరీ ద్వారా ఎంపిక చేసింది.