
ఎంపీల బహిష్కరణ డ్రామా: గట్టు
సోనియా డెరైక్షన్‌లోనే ఎంపీల డ్రామాలు
సీఎం, బొత్స, ఎమ్మెల్యేలను బహిష్కరించరేం?
సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో సరికొత్త డ్రామాకు తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. బిల్లును వ్యతిరేకిస్తున్నందున ఆరుగురు ఎంపీలను బహిష్కరిస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ... అసెంబ్లీలో అదే బిల్లును వ్యతిరేకించిన ఎమ్మెల్యేలను, ఢిల్లీలో ధర్నా చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలు కూడా సోనియాగాంధీ ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే ఇన్నాళ్లూ అవిశ్వాసం, ధర్నాలు అంటూ రకరకాల ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తున్నందువల్లే ఆరుగురిపై వేటు వేశారంటే... మిగతా సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలంగాణకు అనుకూలమా? అని ప్రశ్నించారు. మైనారిటీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ నిర్ణయాలు తీసుకునే అర్హత ఎక్కడిదని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలకు విందులు ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన మహిళాబిల్లు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన తదితర బిల్లులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఆమోదం కోసం ఏనాడూ విపక్షాల మద్దతు కూడగట్టని కాంగ్రెస్ తెలుగుజాతిని చీల్చడం కోసం విందులు ఏర్పాటు చేస్తోంది. తెలుగుజాతిపై ఎందుకింత కక్షగట్టారు? ఏం పాపం చేసిందని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు?
విభజన బిల్లుకు పార్లమెంటులో ఎలాంటి లీగల్ సమస్యలు ఎదురు కాకూడదనే పక్కా ప్రణాళికతో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబుల చేత అసెంబ్లీలో చర్చ జరిగేలా చేసి నాటకీయంగా పంపించారు. రాష్ట్రాన్ని విభజించడం కోసం కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న డ్రామాలన్నింటికీ టీడీపీ వంత పాడుతోంది.
కాంగ్రెస్ మాదిరిగానే చంద్రబాబు కూడా ఇరు ప్రాంత నేతల చేత డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసం సిగ్గుమాలిన పనికి ఒడిగడుతున్నారు.
జాతీయనేతలను చంద్రబాబు ఎందుకు కలుస్తున్నారో చెప్పడంలేదు. విహారయాత్ర మాదిరిగా బాబు పర్యటిస్తున్నారు.
రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా విభజించడానికి సోనియాగాంధీ, చంద్రబాబు, కేసీఆర్‌ల అబ్బ జాగీరు కాదు.
ఆ ఎంపీలకు అభినందనలు: మోదుగుల
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమైక్యత కోసం పార్లమెంటులో ఆందోళన జరిపి, బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎంపీలను అభినందిస్తున్నానని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే సభ్యులను బహిష్కరించడమే కాంగ్రెస్‌లోని అంతర్గత ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.