సీమాంధ్రలో పార్టీని నిలబెట్టుకునే లక్ష్యం
అందుకే వేటు.. త్వరలో మరికొందరిపై!
వారందరితో కొత్త పార్టీ ఏర్పాటు; ఎన్నికల అనంతరం అదీ కాంగ్రెస్‌లోకే!
రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీ నేతలను సైతం
బహిష్కరించామంటూ తెలంగాణలో మైలేజీ
ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీని నిలబెట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించడమని కాంగ్రెస్ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నవారు భావిస్తున్నారు. తెలంగాణ ఇవ్వడం కోసం సొంత పార్టీ నేతలనే బహిష్కరించామంటూ ప్రచారం చేసుకోవడం ద్వారా తెలంగాణలో లబ్ధి పొందడం ఒక ఎత్తు. అలాగే, మరికొందరు సీమాంధ్ర నేతలతో సమైక్యాంధ్ర వాదన బలంగా వినిపించేలా చేసి, వారినీ బహిష్కరించి, లేదా రాజీనామా చేయించి.. వారితో కొత్త పార్టీ ఏర్పాటు చేయించడం మరో ప్రణాళికగా కనిపిస్తోంది.
ఆ కొత్త పార్టీని ఎలాగూ మళ్లీ కాంగ్రెస్‌లోనే కలుపుకోవచ్చన్న ఆలోచనతోనే కాంగ్రెస్ బహిష్కరణ డ్రామా ఆడుతోందని స్పష్టమవుతోంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన పరిస్థితే ఉంటే గడచిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే వీరిపై వేటు పడాల్సింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అప్పట్లో వారిని కాపాడి.. ఇప్పుడు చివరి దశలో సస్పెన్షన్ వేటు వేసింది.
త్వరలో మరికొందరు నేతలను కూడా సస్పెండ్ చేయబోతున్నట్టు ఏఐసీసీ నాయకుడొకరు చెబుతున్నదాన్ని బట్టి ఇదంతా పథకం ప్రకారమే సాగుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రోజు నుంచి కేవలం నిరసనలకే పరిమితమవుతూ తనకు సహకరించిన నేతలపైనా వేటు వేసే ఆలోచనలో అధిష్టానం ఉందని చెబుతున్నారు. వారితో కొత్త పార్టీ పెట్టించి సీమాంధ్రలో ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పించాలన్నదే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. సమైక్యవాదులుగా వారు ఎన్నికలను ఎదుర్కొని ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి వీలుగా ఒక పథకం ప్రకారం వ్యవహారాలు నడిపిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆరుగురు ఎంపీలను సస్పెండ్ చేసిన తరుణంలో మిగిలిన వారు మరింత రెచ్చిపోయే విధంగా కార్యక్రమాలు కొనసాగించాలని హైకమాండ్ నుంచి నేతలకు ఆదేశాలందినట్టు సమాచారం.
వేటు ఇప్పుడే ఎందుకు?
ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం ఇప్పుడే కొత్తకాదు. వాటిపై చర్చకు పట్టుబట్టడంతో ఇదివరకటి శీతాకాల సమావేశాలు జరగకుండా పూర్తిగా స్తంభించిపోయాయి. అయినా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు బహిష్కరించిన ఆరుగురు ఎంపీలే కాకుండా సీఎం, కేంద్ర మంత్రులు, మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలూ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. విభజన బిల్లును తిరస్కరించి పంపడమే కాకుండా కాంగ్రెస్ ప్రతిష్టను సవాలు చేస్తూ సీఎం ఏకంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా, దానిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చినా అధిష్టానం పట్టించుకోకపోగా వారికి ఆ స్వేచ్ఛ ఉందని దిగ్విజయ్‌లాంటి నేతలు సమర్థించారు. గడచిన పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసినా పట్టించుకోని కాంగ్రెస్ హైకమాండ్.. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆ నేతలను సమైక్యవాదులుగా ప్రజల్లోకి పంపించేందుకే ఇప్పుడు వేటు వేసినట్టు చెబుతున్నారు.
మిగతా వారిపైనా...
ఎంపీలు చింతామోహన్, అనంతవెంకటరామిరెడ్డి, బొత్స ఝాన్సీ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజులతో పాటు ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏంచేయనున్నారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. సమైక్యమన్నందుకే ఆరుగురు ఎంపీలపై చర్యలు తీసుకున్నారన్న ప్రచారం చేయించడం.. ఇదే సమయంలో సీమాంధ్రకు చెందిన ఇతర ప్రజాప్రతినిధుల నుంచి మిగిలిన ఎంపీలు, కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచి, తద్వారా వారు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు అడ్డుపడే పరిస్థితి కల్పించడానికి ఈ కొత్త డ్రామాను ప్రారంభించారన్న అనుమానాలు వస్తున్నాయి.
తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో ఇతర ఎంపీలు, కేంద్రమంత్రుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చేలా చేసి వారిపైనా పార్టీ చర్యలు తీసుకోవచ్చని, తద్వారా తెలంగాణ కోసం మంత్రులపై సైతం చర్యలు తీసుకున్నామన్న ప్రచారంతో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ముందుకు వెళ్లాలన్న వ్యూహం ఉండి ఉండవచ్చంటున్నారు. అదే సమయంలో చర్యలు తీసుకోవడం ద్వారా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల భుజాలపైకి సమైక్యవాదాన్ని పెట్టి ప్రజల్లోకి పంపిస్తారని అంటున్నారు. ఎంపీలపై చర్యలతో సీమాంధ్ర కాంగ్రెస్‌లో సమైక్యవాదాన్ని మరింత పెంచడం, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ ద్వారా కూడా రాజీనామా చేయించి, వీరందరితో కొత్త అవతారాలతో ప్రజల్లోకి వెళ్లడమే కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బహిష్కరించినా, స్వయంగా వీడివెళ్లినా వారంతా తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తారంటూ మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం.
అనుకూల మీడియా హంగామా
కిరణ్‌ను సమైక్యవాదిగా ప్రచారం చేసేందుకు మొదట్నుంచీ ప్రయత్నిస్తున్న అనుకూల మీడియా కూడా అధిష్టానం వ్యూహంలో భాగస్వామిగా మారింది. విభజన విషయంలో హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ సీఎం మొదటి నుంచీ సమైక్య వాదన వినిపిస్తున్నారన్న ప్రచారం చేయడంలో ఆ అనుకూల మీడియా ముందుంది. హైకమాండ్ పెద్దలను కలసినప్పుడు సమైక్యం కోసం కిరణ్ గట్టి వాదన వినిపించారని ప్రచారం చేయడం, అసెంబ్లీలో ఫలానా చేయబోతున్నారంటూ ముందురోజే ఆ మీడియాలో రావడం, ఆ మరుసటి రోజు సీఎం అదే చేయడం.. గత కొద్ది రోజులుగా ఇదంతా ఒక పథకం ప్రకారమే సాగుతోంది. సీఎం 13వ తేదీన రాజీనామా చేస్తారని కూడా ఆ మీడియా గత కొద్దిరోజులుగా ప్రచారం చేస్తోంది. అంటే ఇదంతా ముందుగా ఒక పథకం ప్రకారం జరుగుతున్నదేనని తెలుస్తోంది.
సీఎంకు కొత్తపార్టీ పెట్టే సామర్థ్యముందా?
సీఎం, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సమైక్యపార్టీని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని రకాల ప్రణాళికలు రచిస్తున్నా అవి కార్యరూపం దాల్చడంపై ఆపార్టీ నేతల్లోనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త పార్టీని ఏర్పాటుచేసి, నిర్వహించేంత సామర్థ్యం కిరణ్‌కు లేదని ఆయన సన్నిహిత నేతలు అభిప్రాయపడుతున్నారు. ఖర్చును భరించడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా వ్యవహారాన్ని నడిపించడం ఆయనకు చేతనయ్యేది కాదని పెదవి విరుస్తున్నారు. ఒకవేళ కిరణ్, కాంగ్రెస్ నేతలతో కొత్త పార్టీని పెట్టించినా ప్రజలు వారిని నమ్ముతారనుకోవడం భ్రమేనని సీఎం వ్యతిరేకవర్గం నేతలు కుండబద్ధలు కొడుతున్నారు.
బహిష్కరణ.. వ్యూహంలో భాగమే !
Published Wed, Feb 12 2014 2:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement