సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని నిన్నటివరకు చెబు తూ వస్తున్న సీమాంధ్ర మంత్రులు ఒక్కో మెట్టు దిగుతున్నారు. విభజనవల్ల తమ ప్రాంతంలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తే తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామంటున్నారు. రాష్ర్టం విడిపోతే తలెత్తే ప్రధాన సమస్యలు సాగునీరు, ఉద్యోగ భద్రత, హైదరాబాద్ లాంటి అంశాలను సీమాంధ్ర కు అన్యాయం జరగకుండా పరిష్కరిస్తే విభజనకు తమకేమీ అభ్యంతరం లేదనేదే వీటి సారాంశం. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి దీనిపై చర్చించేందుకు ముందుకు రావాలని తెలంగాణ మంత్రుల్ని కోరుతున్నారు.
కాగా తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరించే మంత్రుల్నిగాక తమ ప్రాంత సమస్యలపై సానుకూల ధోరణితో ఉన్న అమాత్యుల్ని చర్చలకు పిలిచేందుకు సీమాంధ్ర మంత్రులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా శ్రీధర్‌బాబు, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి తదితరులతో మంతనాలు జరుపుతున్నారు. సీమాంధ్ర మంత్రుల ప్రతిపాదనపై చర్చిం చేందుకు వారూ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నందున ఒకరోజు ముందు వీరంతా సమావేశమై విభజన వల్ల తలెత్తే సమస్యలు, పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.
‘‘రాష్ట్ర విభజన ప్రక్రియ నుంచి వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని అధిష్టానం తెగేసి చెబుతోంది. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన గాడితప్పింది. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేకు పడాల్సిన అవసరముంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రతిపాదన తెచ్చాం. విభజనవల్ల తలెత్తే సమస్యలు, పరిష్కార మార్గాలపై ఓ ప్రతిపాదనను రూపొందిస్తున్నాం. మా ప్రతిపాదనలకు పరిష్కార మార్గం చూపితే విభజనకు అంగీకరిస్తాం’’ అని ఏరాసు తెలిపారు. విభజనవల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని పరిష్కరించడం సాధ్యమా? కాదా? అనేది ఇరుప్రాంతాల నేతలు కూర్చుని మాట్లాడుకుంటే ఓ అంచనాకు రావొచ్చని గంటా చెప్పారు. టీ-మంత్రులు తమకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కార మార్గాలు చూపితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు.
మెట్టు దిగిన కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు!
Published Sat, Sep 14 2013 3:01 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement