రాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉందని, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్:
రాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉందని, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. స్థానిక బైపాస్‌రోడ్‌లోని రామకృష్ణ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన సీపీఐ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సరిదిద్దేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో సీమాంధ్రలో 50 రోజులుగా ఉద్యమం సాగుతోందని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతుతోనే వారు ఆందోళన చేస్తున్నారని అన్నారు.
ఆర్టీసీతో సహా పలు సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో పాలన స్తంభించిందన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, రేషన్ దుకాణాల ద్వారా కూడా వాటిని సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు నాడు అంగీకరించిన పార్టీలే నేడు కాదంటూ డ్రామాలాడుతున్నాయని, అనుకూలంగా లేఖలిచ్చిన పార్టీలు ఇప్పుడు తప్పుడు నిర్ణయాలతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై జాప్యం చేయడం తగదన్నారు. నిర్ణయంలో ఏమాత్రం తేడా వచ్చినా కాంగ్రెస్ భూస్థాపితమవుతుందని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో తాము మొదట తీసుకున్న వైఖరికే కట్టుబడి ఉన్నామని, ఓట్లు, సీట్లు తమ ఎజెండా కాదని, తెలంగాణ ఏర్పాటే లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయని, ఆ రెండు పార్టీల ఎజెండా ఆర్థిక దోపిడీయేనని విమర్శించారు. దేశంలో అవినీతి నానాటికీ పెరుగుతున్నా ప్రధాని మన్మోహన్‌సింగ్ చేష్టలుడిగి చూస్తున్నారని విమర్శించారు.
ప్రధాని కార్యాలయంలోనే కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించిన ఫైళ్లు మాయం కావటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అటు నరేంద్రమోడీతో, ఇటు మన్మోహన్‌సింగ్‌తో స్నేహం చేస్తూ తమ దోపిడీని కొనసాగించేందుకు ముఖేష్ అంబానీ పథకం రూపొందిస్తున్నారని ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో వామపక్ష రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు జాతీయ స్థాయిలో ఒక వేదికపైకి రానున్నామని, అక్టోబర్‌లో వామపక్ష జాతీయ నేతలతో సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వార్తా పత్రికలు, మీడియా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందన్నారు. డీజీపీ వ్యవహారంలో మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేయటం శోచనీయమన్నారు. భూపంపిణీ సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 3,4,5 తేదీల్లో దేశ వ్యాప్తంగా సత్యాగ్రహ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ది వెంకటేశ్వర్లు, టి.వి.చౌదరి, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కె సాబీర్ పాషా, నాయకులు పోటు ప్రసాద్, మిర్యాల రంగయ్య, మహ్మద్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.