కాంగ్రెస్, టీడీపీకి షాక్ | Congress, TDP shock | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీకి షాక్

Published Fri, Oct 4 2013 4:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress, TDP shock

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష  తెలుగుదేశం, సీపీఐ లకు తెలంగాణ షాక్ తలిగింది. ఇంతకాలం నాటకాలతో నెట్టుకొచ్చిన ఆయా పార్టీ నేతలు ఇక జనంలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. గురువారం రాత్రి జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ మూడు పార్టీల నేతలు, మద్దతుదారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మా రింది. విభజనకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలపడం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే అవలంబిస్తూ విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకపోవడం ఆ పార్టీలపై ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయ్యింది.

విభజనకు అనుకూలంగా ఉన్న సీపీఐ జిల్లా వాసులకు ఇప్పటికే దూరమైంది. విభజనకు అనుకూలంగా ఉన్నప్పటికీ సీమాంధ్ర సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా బీజేపీ కాస్త నయమనిపించింది. 65 రోజులుగా జిల్లాలో తీవ్రంగా జరిగిన సమైక్య ఉద్యమాలను పట్టించుకోకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జిల్లా వాసులను, ఉద్యమకారులకు ఆందోళనకు గురిచేసింది. క్యాబినెట్ ప్రటకన వెలువడగానే జిల్లాలో జనం భగ్గుమన్నారు. ఎక్కడికక్కడ రహదారులపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.

శుక్రవారం నాడు తిరుపతి బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. పలుచోట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనియా దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలను దహనం చేశారు. జిల్లాలో పలుచోట్ల గురువారం రాత్రి నుంచి బంద్‌లు కొనసాగుతున్నాయి. కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. మరో పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూల మంటూ లేఖ ఇవ్వడం వల్లే ఈ నిర్ణయం వెలువడిందని సమైక్యవాదులు ఆరోపిస్తున్నారు.

పలు వేషాలు వేస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్‌ను, అర్థంపర్థం లేని ఆరోపణలు చేసే ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడును కూడా సమైక్యవాదులు అడ్డుకుంటున్న వైనం ఆ పార్టీ క్యాడర్‌ను కలవవపరుస్తోంది. ఇక అధికార పార్టీకి చెందిన ఎంపీ చింతామోహన్ నియోజకవర్గ ప్రజలకు మొహం చాటేశారు. గురువారం ఆయన ఇంటి ముట్టడికి వెళ్లిన జేఏసీ నేతల ఎదుట పోటీ ఉద్యమం నిర్వహింపజేసి అభాసుపాలయ్యారు. ఇళ్ల పట్టాల కోసం తన ఇంటికి వచ్చిన మహిళలతో సమైక్య నినాదాలు చేయించి జేఏసీ నేతలను అడ్డుకొని కొత్త నాటకానికి తెరతీశారు.

క్యాబినెట్ నిర్ణయం వెలువడిన తర్వాత కూడా ైవె ఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం మాత్రమే సమైక్యానికి అనుకూలంగా స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. సీపీఎం సమైక్య ఉద్యమాల్లో పాల్గొనకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఒక్కటే స్పష్టమైన వైఖరితో ఉద్యమాలు నిర్వహిస్తోంది. బుధ, గురువారాల్లో 48 గంటల పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు జరిగాయి. క్యాబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి 72 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో సమైక్యవాదులంతా ఈ బంద్‌లో పాల్గొని నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement