జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణలో వైఎస్సార్ సీపీకి లభిస్తోన్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక కొందరు తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఎస్.ఉజ్వల్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమంటూ దుష్ర్పచారం చేయడం కుట్రలో భాగమని ఆయన అన్నారు. శనివారం జహీరాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుండడం వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సి వచ్చిందన్నారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలని మాత్రమే కోరడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు వైఎస్సార్ సీపీ కట్టుబడి ఉందని, ఈ ప్రాంతంలోనూ తమ పార్టీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధినేతగా ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతానికి కొత్త నాయకుడిని ప్రకటించడం జరుగుతుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, ఇతర జాతీయ పార్టీలు మాత్రమే ఉంటాయని, టీఆర్‌ఎస్ ఒక్కటే ఉండదని ఆయన స్పష్టం చేశారు. పదిరోజులపాటు నిద్రపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా మేల్కొని రాజకీయ లబ్ధి కోసం ప్రధానికి లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రావడం ఏ మాత్రం ఇష్టం లేకనే ఆయన ఆ ఉత్తరం రాశారని ఉజ్వల్‌రెడ్డి విమర్శించారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఎస్.నారాయణ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి మాణిక్‌రావు, పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అలీ, నాయకులు క్రిష్టఫర్, అరుణ్‌కుమార్, అక్తర్ ఆహ్మద్, ముబిన్ లష్కర్, గిరిధర్‌రెడ్డి, బాబుకుమార్, కలీమొద్దీన్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ యూత్ పట్టణ కమిటీ రద్దు- గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడి
సంగారెడ్డి డివిజన్:వైఎస్సార్ సీపీ యువజన విభాగం జహీరాబాద్ పట్టణ కమిటీని రద్దు చేసినట్టు పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి శనివారం ప్రకటించారు. యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుత కమిటీని రద్దు చేశామన్నారు. త్వరలో కసరత్తు పూర్తి చేసి నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆయన దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకే సీఎం కిరణ్ అనవసర ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని శ్రీధర్‌రెడ్డి దుయ్యబట్టారు.
వైఎస్సార్ సీపీని దెబ్బతిసేందుకు కుట్ర
Published Sun, Aug 11 2013 12:27 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement