మచిలీపట్నం (కోనేరుసెంటర్), న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ పనితీరు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మూడు రోజుల క్రితం ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని బెది రించి బంగారు గొలుసు స్వాహా చేసి అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మచిలీపట్నం ఆర్టీసీ కాలనీకి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని తరచూ తన స్నేహితుడిని కలసి మాట్లాడుతుండేది. ఈ విషయాన్ని కొద్దికాలంగా మచిలీపట్నం స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ గమనించాడు. ఆదివారం రాత్రి యువతి తన స్నేహితుడి ద్విచక్రవాహనంపై వచ్చి... తన ఇంటికి సమీపంలో వాహనం దిగి ఇంటికి నడిచి వెళుతోంది. ఈ సమయంలో కానిస్టేబుల్ ఆమెను అడ్డగించాడు.
స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చావని మీ ఇంట్లోని పెద్దలకు చెబుతానని యువతిని బెదిరింపులకు గురిచేశాడు. తన తండ్రి గుండెజబ్బుతో బాధపడుతున్నాడని విషయాన్ని పెద్దలకు చెప్పవద్దని యువతి బతిమలాడటంతో ఆమెను బెది రించి తన ద్విచక్రవాహనంపై కరగ్రహారం వెళ్లే రోడ్డులో ఉన్న రైల్వేట్రాక్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ తన కోరిక తీర్చకుంటే విషయం అందరికీ చెప్పేస్తానని బెదిరింపులకు దిగటంతో యువతి తన మెడలో ఉన్న బంగారు గొలుసును తీసి కానిస్టేబుల్‌కు ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని యువతి తన స్నేహితుడికి తెలియజేయటంతో తనకు తెలిసిన పెద్దలకు కానిస్టేబుల్ నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు.
చిలకలపూడి ప్రాంతానికి చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్లు కానిస్టేబుల్‌ను పిలిపించి పంచాయతీ పెట్టారు.పెద్దలు కానిస్టేబుల్‌ను పిలిపించి బంగారు గొలుసు ఇచ్చేయమని కోరగా కానిస్టేబుల్ తిరస్కరించాడు. తనకు పోలీసు అధికారులు తెలుసని నానా హంగామా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యువతి, ఆమె స్నేహితుడు ఎస్పీని కలిసి కానిస్టేబుల్ నిర్వాకంపై ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధులవుతున్నారు. ఈ విషయంపై మచిలీపట్నం ఎస్‌ఐ భాస్కర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. రుజువైతే కానిస్టేబుల్‌పై శాఖా పరమైన చర్యలుంటాయని తెలిపారు.
బ్లాక్‌మెయిల్ కానిస్టేబుల్ !
Published Wed, Sep 11 2013 5:32 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement