మహిళ ఉద్యోగిపై కానిస్టేబుళ్ల వీరంగం
ఆర్టీసీ బస్సులో మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించి వీరంగం సృష్టించిన కానిస్టేబుళ్లపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. దేవరపల్లి గ్రామానికి చెందిన గారపాటి అనిత పద్మకుమారి గోపాలపురం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె కుమారుడు విజయవాడలో చదువుకుంటున్నాడు. ఆదివారం విజయవాడ వెళ్లిన ఆమె కుమారుడిని చూసి సాయంత్రం తిరిగి ఆర్టీసీ బస్సులో దేవరపల్లి బయల్దేరింది.
అదే బస్సులో ఏలూరు ఆశ్రం ఆస్పత్రి వద్ద ఏలూరు పోలీసు హెడ్ క్వాటర్స్‌లో ఉంటున్న ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు పోలి ప్రభుదాస్, కంకిపాటి రాజు, పంపన సూరిబాబులు విశాఖపట్నం నుంచి ఖైదీలను తీసుకు వచ్చేందుకు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ప్రభుదాస్ పద్మకుమారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమె బ్యాగ్‌ను తనిఖీ చేయాలంటూ పట్టుబట్టడంతో భయపడిన పద్మకుమారి పోలీస్ స్టేషన్ వద్ద బస్సు ఆపాలంటూ డ్రైవర్‌కు చెప్పింది. పోలీస్ స్టేషన్ వద్ద ఎందుకు బస్సు ఆపమన్నావంటూ ప్రభుదాస్ పద్మకుమారి తలకు తన వద్ద ఉన్న గన్‌ను ఎక్కు పెట్టడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురై మౌనం వహించారు.
మిగిలిన కానిస్టేబుళ్లు కూడా ప్రభుదాస్‌కు వత్తాసు పలికారని అనంతపల్లి పోలీసులకు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు ఆమె పేర్కొన్నారు. సోమవారం అనంతపల్లి పోలీస్ స్టేషన్‌కు కానిస్టేబుళ్లను తీసుకురాగా, అక్కడకు వచ్చిన పద్మకుమారి కానిస్టేబుళ్లను నిలదీసి ఓ మహిళా ఉద్యోగిపై దాడికి దిగడం ఏమిటని నిలదీయడంతో వారు క్షమాపణ కోరారు. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే కేసు నమోదు చేయాలని బాధితురాలు కోరగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో స్పందించిన పొలీసులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.