
కాంట్రాక్ట్ అధ్యాపకుడి ఆత్మహత్యాయత్నం
ఉద్యోగం నుంచి తొలగిస్తామన్న ప్రకటనతో ఆందోళన..
శ్రీకాళహస్తి: కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తామని ప్రభ్తుత్వం ప్రకటించడంతో మనస్తాపానికి గురైన ఓ అధ్యాపకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న స్కిట్ (శ్రీకాళహస్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కిట్ కళాశాలను శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహిస్తోంది. ఆరేళ్లుగా ఇక్కడ 63 మంది కాంట్రాక్ట్ కింద అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రతి పదకొండు నెలలకు ఒకసారి తొలగించి మరలా వారినే కాంట్రాక్ట్ విధానంలో కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రస్తుతం వారందరినీ తొలగించి నైపుణ్యం ఉన్నవారిని అవసరమైన (10శాతం) మేరకు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటించారు. దీంతో శ్రీకాళహస్తికి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకుడు తులసీకృష్ణ ఆందోళనకు గురై సోమవారం కళాశాలలోనే విషపుగుళికలు మింగి స్పృహతప్పి పడిపోయాడు. ఆయనను విద్యార్థులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గించే పనిలో భాగంగానే ఇంటర్వ్యూల ద్వారా అవసరమైన మేరకు నైపుణ్యం కలిగినవారిని మాత్రమే తీసుకుంటున్నామని తెలిపారు.