నగరాలు, పట్టణాల్లో విలువైన భూములను లీజుదారులకు కట్టబెట్టే యత్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లోని మున్సిపల్ లీజు స్థలాలకు ముప్పు ముంచుకొస్తోంది. విలువైన భూములకు సంబంధించి లీజుకిచ్చిన వివరాలు స్థానిక సంస్థల్లో లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో స్థలాలను లీజుదారులకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రికార్డులులేని స్థలాలనే కాక.. రికార్డులు ఉన్న వాటిని సైతం లీజుదారులకు ధారాదత్తం చేసే యత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం 25 ఏళ్లకు మించి మున్సిపల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి వీల్లేదని నిబంధన ఉంది.
లీజు గడువు ముగియగానే ఆ స్థలాలను బహిరంగ వేలం ద్వారా మళ్లీ లీజుకు ఇవ్వాలని నిబంధనలు చెపుతున్నాయి. అయితే ఇదివరకటి నిబంధనలను సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని నిర్ణయించింది. ఈ ఉపసంఘానికి రెవెన్యూ మంత్రి చైర్మన్‌గా, పురపాలక మంత్రి కన్వీనర్‌గా, కార్మిక శాఖ మంత్రి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి.
నగరాలు, పట్టణాల్లో కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ స్థలాలపై కన్నేసిన ఓ ముఖ్యనేత సోదరుడు, రాజధాని నగరానికి చెందిన ఓ మంత్రి తమ పనిని సజావుగా సాగించేందుకు ఎత్తుగడ వేసినట్లు సమాచారం. 25 ఏళ్లు వ్యాపారం చేసిన తర్వాత వారికి కాకుండా లీజు స్థలాలను బహిరంగ వేలంలో ఇతరులకు కేటాయిస్తే.. వారి జీవితాలు ఏం కావాలంటూ ఓ మంత్రి ప్రశ్నించడమే కాక, ఆ స్థలాలను లీజుదారులకే కట్టబెట్టాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ స్థలాలు, దుకాణాల సముదాయాలను కారు చౌకగా లీజు రూపంలో దక్కించుకున్న వారు ఇప్పుడు వాటిని విడిచిపెట్టేందుకు ససేమిరా అంటున్నారు. లీజు ధర పెంచాలని స్థానిక సంస్థలు ప్రయత్నించినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. దీంతో ఒకసారి లీజు పొందితే.. ఇక ఆ దుకాణాలుగానీ, స్థలాలుగానీ లీజుదారుల సొంతమయ్యేలా పరిస్థితి ఉంటోంది.
అధికారులు మారిపోవడం, రికార్డులు గల్లంతు కావడం వంటి కారణాలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో లీజు అద్దె వసూలు కాని పరిస్థితులున్నాయి. ఎస్టేట్ కార్యాలయంలో ఏ స్థలాలు, దుకాణ సముదాయాల లీజు ఎప్పుడు ముగుస్తుందన్న సమాచారం లేకపోవడం ఒకటైతే.. రికార్డులు కూడా గల్లంతైన సంఘటనలు ఉన్నాయి. నల్లగొండ మున్సిపాల్టీ, అనంతపురం జిల్లా ధర్మవరం, తాడిపత్రి మున్సిపాల్టీల్లోనూ స్థలాలను కారు చౌకగా ఎన్నో ఏళ్ల నుంచి అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తోంది.