
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మరో ముగ్గురు కరోనా బాధితులు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. పరీక్షల్లో కరోనా నెగిటివ్ రావడంతో వారిని ఆసుపత్రి నుంచి వైద్యుల డిశ్చార్జ్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించి కరోనా నెగిటివ్ అని నిర్ధారించుకున్న తరువాతే వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు విశాఖలో 13 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చికిత్స పొందుతున్న తొమ్మిది మందిని కూడా వైద్యులు విడుదల చేశారు. వీరంతా ఢిల్లీ మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిలో పెనుగొండకు చెందిన ఒకరు, భీమవరంకు చెందిన ఇద్దరు, మిగిలిన ఆరుగురు ఏలూరుకు చెందిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు పశ్చిమగోదావరి జిల్లాలో 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 603కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 31 మందికి పాజిటివ్‌గా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment