సాక్షి, విశాఖపట్నం : ఒంగోలు, విశాఖపట్నం నగరాల్లో తాజాగా ఒక్కో కరోనా (కోవిడ్–19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో మూడు పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. తొలి కేసు నెల్లూరులో నమోదు కాగా, ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. ఒంగోలుకు చెందిన యువకుడు ఐదు రోజుల క్రితం లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు.. అక్కడ స్నేహితుడి ఇంట్లో నాలుగు రోజులు ఉన్నాడు. ఈ నెల 15న ఒంగోలుకు చేరుకున్నాడు. 16న కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని ఒంగోలు జీజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డులో చేర్చి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అటు విశాఖకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకు వెళ్లాడు. 10న విశాఖకు చేరుకున్నాడు. 17న దగ్గు, జలుబు లక్షణాలతో చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. ఇతని రక్త నమూనాలు ల్యాబ్‌కు పంపగా, పాజిటివ్ వచ్చినట్లు గురువారం రాత్రి 9 గంటలకు వచ్చిన రిపోర్టులో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment