సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం రెట్టింపు సంఖ్యలో పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 483కి చేరింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 21 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో తొలిసారిగా 100 కేసులు దాటిన జిల్లాగా నమోదైంది.
► సోమవారం వరకు కరోనా నిర్ధారణ పరీక్షల గరిష్ట సామర్థ్యం 1100–1200 మధ్య ఉండగా తాజాగా 2,010 పరీక్షలు చేశారు. అంటే పరీక్షల సంఖ్య దాదాపు రెట్టింపైంది.
► గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114కి చేరింది.
► మంగళవారం కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 1, వైఎస్సార్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
మరో నలుగురు డిశ్చార్జి..
విశాఖపట్నం జిల్లాలో కరోనా బారిన పడి కోలుకున్న ఇద్దరు వ్యక్తులను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు. తూర్పు గోదావరి జిల్లాల్లోనూ కరోనా నుంచి కోలుకుని మరో ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 16కి చేరింది. కృష్ణా జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వైద్యుడు చెన్నై అపోలో ఆస్పత్రిలో మరణించినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 9కి పెరిగింది.
► ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినవారు, మృతులను మినహాయిస్తే రాష్ట్రంలో కరోనా యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 458గా ఉంది.
ఆ కుటుంబం గెలిచింది
విశాఖ జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా
సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం కరోనాను జయించింది. లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి గత నెల 22వ తేదీన కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో అతడి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌కు తరలించారు. బాధిత యువకుడి కుటుంబంలో మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
ఒకే ఇంట్లో నలుగురికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమై గ్రామంలో ఆంక్షలు విధించారు. అనంతరం బాధితుల్లో ఇద్దరికి కరోనా నెగిటివ్‌గా తేలడంతో కొద్ది రోజుల క్రితం డిశ్చార్జి చేశారు. మిగతా ఇద్దరిని సోమవారం రాత్రి డిశ్చార్జి చేశారు. వీరంతా హోం క్వారంటైన్‌లో 14 రోజులపాటు జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment