కోవిడ్‌ కేర్‌ఫుల్‌ సెంటర్లు | Covid-19 Careful Centers in AP | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కేర్‌ఫుల్‌ సెంటర్లు

Published Sat, Jul 11 2020 4:23 AM | Last Updated on Sat, Jul 11 2020 7:56 AM

Covid-19 Careful Centers in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 76 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 45,240 బెడ్‌లను సిద్ధంగా ఉంచినట్లు కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో కనీసం మూడు వేల బెడ్‌లను అందుబాటులో ఉంచామని, త్వరలోనే వీటిని 5 వేల పడకలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని వివరించారు. కోవిడ్‌ ఆసుప్రతికి కనీసం 15 నిమిషాల ప్రయాణ దూరంలోనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ సెంటర్లు అందుబాటులో ఉంటాయన్నారు. శుక్రవారం ఆయన జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కోవిడ్‌ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడం, పాజిటివ్‌ పేషెంట్లు, అనుమానిత లక్షణాలున్న వారికి మెరుగైన సేవలను అందించడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. 

ఆహారం ప్యాకింగ్‌కు  ఐఆర్‌సీటీసీ సాయం..
► క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(డెవలప్‌మెంట్‌)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు మొబైల్‌ ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్‌ సదుపాయాలను కల్పిస్తున్నాం. ఇప్పటివరకు 23 యాక్టివ్‌ సెంటర్లలో 2,280 మంది  అడ్మిట్‌ అయ్యారు. శుక్రవారం 230 మంది చేరారు.
► రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో 5,874 మంది చికిత్స పొందుతున్నారు. 9,421 మంది అనుమానితులు 116 క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారు. క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మంచినీరు, ఆహారం, శానిటేషన్, వైద్య బృందాల సేవలు, అంబులెన్స్‌లు తదితరాల విషయంలో ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించినా సహించేది లేదు. ఆహారం ప్యాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సహాయం తీసుకుంటాం.  

రోజూ 13 వేల మందికిపైగా ఏపీలోకి..
► రోజూ రోడ్డు మార్గంలో 4,600 మంది వరకు రాష్ట్రంలోకి వస్తున్నారు. 22 రైళ్ల ద్వారా సుమారు ఏడు వేల మంది వరకు ఏపీకి చేరుకుంటున్నారు. విమానాల ద్వారా సుమారు 1,500 మంది వరకు వస్తున్నారు. సగటున రోజుకు 13 నుంచి 15 వేల మంది వరకు ఏపీకి వస్తున్నారు. నాలుగు చార్టెడ్‌ విమానాల ద్వారా రోజుకు సుమారు 600 మంది రాష్ట్రంలోకి చేరుకుంటున్నారు.

ఫిర్యాదులపై థర్డ్‌ పార్టీతో సర్వే
► క్వారంటైన్, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, కోవిడ్‌ ఆసుపత్రులపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌ పార్టీతో సర్వే నిర్వహించింది. కొన్ని సెంటర్లలో సదుపాయాల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించడంతో జిల్లా జాయింట్‌ కలెక్టర్లు (డెవలప్‌మెంట్‌) వీటిని పర్యవేక్షించాలని నిర్ణయించాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరికి మెమోలు కూడా ఇస్తున్నాం. 

మరోసారి సర్వే చేస్తాం..
► మరోసారి థర్డ్‌ పార్టీతో రెండో విడత సర్వే నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. కోవిడ్, క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై పాజిటివ్‌ వ్యక్తులు, అనునిత లక్షణాలు ఉన్న వారి నుంచి రాష్ట్ర కోవిడ్‌ కంట్రోల్‌ రూం ద్వారా అభిప్రాయాలను సేకరిస్తాం. ఐవీఆర్‌ఎస్‌తో కూడా సమాచారం తీసుకుని ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా చర్యలు చేపడతాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement