ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారికి ఏమాత్రం భయపడక్కర్లేదని..సకాలంలో స్పందించడమే ముఖ్యమని రాష్ట్రంలో కరోనాను జయించి డిశ్చార్జి అయిన వారు చెబుతున్నారు. మన ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్లు కొండంత భరోసా కల్పిస్తున్నారని.. వారి ధైర్య వచనాలు ఎంతో ఉత్తేజాన్నిస్తున్నాయని.. కంటికి రెప్పలా చూసుకుంటున్నారని వీరంటున్నారు.స్వీయ నిర్బంధంతో కరోనాను ఎంతో సులభంగా అరికట్టవచ్చని.. ఏమరపాటు అసలే వద్దని చెబుతున్న ‘కరోనా’ విజేతల మనోగతం..
విశ్వవ్యాప్తంగా మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిని వీరంతా జయించారు. నిర్ధారిత పరీక్షలకే భయపడుతున్న ప్రజలకు భరోసానిస్తూ.. కరోనాని తరిమికొట్టి.. థిలాసాగా బయటికొచ్చారు వీరంతా. వైద్యులు అందించిన ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్స తీసుకున్నారు. కరోన మహమ్మారి కోరలను ఛేదించుకుని బయటపడ్డారు. వీరంతా ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటూ కరోనాకు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదంటున్నారు. వీరి అనుభవాలు వారి మాటల్లోనే..
– సాక్షి నెట్‌వర్క్
వైద్యులు చాలా బాగా చూశారు
నేను పారీస్ నుంచి విజయవాడ వచ్చాను. నాకు జ్వరం, జలుబు, దగ్గు ఉండటంతో నేనే స్వచ్ఛందంగా ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. అక్కడి వైద్యులు పాజిటివ్ అని తేల్చారు. అప్పటి నుంచి 15రోజుల పాటు నన్ను ఐసోలేషన్‌లో ఉంచారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది చాలా కేర్ తీసుకున్నారు. మూడుసార్లు పరీక్ష చేసి నెగిటివ్ రావడంతో ఈనెల 4న డిశ్చార్జి చేశారు.
– హేమంత్, విజయవాడ
అందుకే త్వరగా కోలుకున్నా..
కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో విమానంలో నాలుగు గంటలు ప్రయాణం చేయడంవల్లే నాకు పాజిటివ్ వచ్చింది. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండడం ద్వారానే దీనిని అరికట్టవచ్చు. కరోనా లక్షణాలుంటే హోమ్ క్వారంటైన్‌లో ఉండడం మంచిది. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నాకు మంచి వైద్య సౌకర్యాలు కల్పించారు. అందుకే త్వరగా కోలుకున్నా.
– పెండ్యాల హర్ష, రాజమహేంద్రవరం
వైద్యులు భరోసా ఇచ్చారు..
మక్కా నుంచి వచ్చిన రెండ్రోజులకు ఒంట్లో నలతగా అనిపించి ఆస్పత్రికి వెళ్లాను. కరోనా పాజిటివ్ అని చెప్పగానే కాస్త ఆందోళన చెందా. ఇంతలో నా భార్యకి కూడా పాజిటివ్ అని చెప్పారు. భయం మరింత పెరిగింది. కానీ.. ఆస్పత్రిలో వైద్యులు ఎప్పటికప్పుడు అందించిన భరోసానే నాలో ఉత్తేజాన్నిచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. కరోనాకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు.
– ఎస్‌కే సత్తార్, కరోనా జయించిన వ్యక్తి, అల్లిపురం, విశాఖ
డాక్టర్లు నిజంగా దేవుళ్లు
మా ఆయనకి కరోనా వచ్చిందని చెప్పడంతో గుండె ఆగినంత పనైంది. మా ఇంటికి వైద్యులు, పోలీసులు వచ్చి నన్ను, నా కుమార్తెని కూడా పరీక్షలకు రమ్మంటే వెళ్లాం. నా కుమార్తెకు లేదని చెప్పారు. నాకు ఉందనగానే భయపడ్డా. నా కుటుంబం ఏమైపోతుందోనన్న ఆందోళనతో కన్నీళ్లు ఆగలేదు. కానీ.. డాక్టర్లు నిజంగా దేవుళ్లు. కంటికి రెప్పలా చూసుకున్నారు. అందుకే బయటికి రాగలిగాం. ఎవ్వరూ అధైర్య పడక్కర్లేదు.
– గుల్షన్ ఆరా, కరోనా జయించిన మహిళ, అల్లిపురం, విశాఖ
కంప్యూటర్ వైరస్ లాంటిదే..
కంప్యూటర్‌కు వైరస్ ఎలా వస్తుందో ఇది అంతే. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అపాయం ఉండదు. లండన్ నుంచి ఢిల్లీకి వచ్చా. అక్కడ నుంచి విశాఖకు వచ్చేవరకూ ఎలాంటి లక్షణాల్లేవు. ఇక్కడ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. విశాఖ ఛాతీ ఆస్పత్రిలో వైద్యులు చాలా ధైర్యం చెప్పారు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను.
– బాధితుడు (23 ఏళ్లు), రేవిడి వెంకటాపురం, పద్మనాభం మండలం, విశాఖపట్నం
ప్రభుత్వ చర్యలవల్లే బయటపడ్డా
కరోనావల్ల ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదు. నేను లండన్ నుంచి వచ్చిన వెంటనే కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో వెంటనే వైద్యాధికారులను సంప్రదించా. 14 రోజులు కోవిడ్ కేంద్రాల్లో చికిత్స చేశారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చేశాను. ఆరోగ్యంగా ఉన్నాను. ప్రభుత్వ చర్యలవల్లే నేను బయటపడ్డా.
– హేమస్వరూప్, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా
ముందే జాగ్రత్తపడ్డాను
నేను లండన్ నుంచి ఒంగోలుకు రాగానే కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి నా కుటుంబ సభ్యులను కలవకుండా జాగ్రత్తపడ్డాను. వెంటనే ఒంగోలు జీజీహెచ్‌లో చేరాను. పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో కొంత భయపడ్డా. వారు చాలాబాగా చికిత్స చేశారు. డిశ్చార్జ్ సమయంలో హర్షధ్వానాల మధ్య వారు నన్ను సాగనంపిన తీరు మర్చిపోలేను. కరోనాకు భయపడక్కర్లేదు.
– ఒంగోలుకు చెందిన 23ఏళ్ల యువకుడు
మంచి వైద్యం అందింది
నేను ఇటలీ నుంచి మార్చి 6న నెల్లూరు వచ్చాను. నాకు దగ్గు, జలుబు రావడంతో అధికారులకు చెప్పాను. వెంటనే వారు నన్ను ఐసోలేషన్‌లో ఉంచారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. వైద్యులు నాకు ధైర్యం చెప్పడంతోపాటు మంచి వైద్యం అందించారు. దీంతో నేను కోలుకున్నా. గత నెల 23న డిశ్చార్జి అయ్యా. అప్రమత్తత.. జాగ్రత్తలతో కోవిడ్‌ను తరిమేయవచ్చు.
– నిఖిల్, నెల్లూరు
అపోహలతో భయపడ్డా
అపోహలవల్ల కరోనాకు ముందు భయపడ్డాను. విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి వైద్యుల భరోసాతో ధైర్యం వచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు ఉండవని అందరూ అనుకుంటారు. కానీ, అక్కడి వైద్యులు చక్కని వైద్యం అందించి ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. సమయం ప్రకారం ఆహారాన్ని అందించారు. నాకు పూర్తిగా నయమైంది.
– బాధితుడు (54 ఏళ్లు), రేవిడి వెంకటాపురం, పద్మనాభం మండలం, విశాఖపట్నం
లక్షణాలు కనిపించగానే వస్తే
కరోనా లక్షణాలు కనిపించగానే పీహెచ్‌సీ డాక్టరునుగానీ, ఆశా కార్యకర్తకు గానీ, ఏఎన్‌ఎంకు గానీ సమాచారమివ్వాలి. వెంటనే వారు నమూనాలు సేకరించి ఆస్పత్రికి తరలిస్తారు. ఇప్పటివరకూ మృతిచెందిన వారిలో వైద్యానికి లేటుగా వచ్చిన వారే ఎక్కువ. సకాలంలో వస్తే 14 రోజుల్లో పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లచ్చు.
– డా. అరుణకుమారి, ప్రజారోగ్య సంచాలకులు
సకాలంలో స్పందించకే..
కరోనా లక్షణాలుండి శ్వాసకోశ సమస్యలొస్తే వెంటనే 1902 లేదా 104కు ఫోన్‌చేస్తే ఆస్పత్రులకు వెళ్లే సౌకర్యం ఉంది. కానీ, కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలున్నా సకాలంలో ఆస్పత్రికి వెళ్లకపోవడంవల్ల జరగరాని నష్టం జరిగిపోతోంది. ఏమవుతుందిలే అన్న ఆలోచనే ప్రాణాలకు ముప్పు తెస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌తో ఆరుగురు మృతిచెందారు. వీరిలో లక్షణాలు బాగా ముదిరాక ఆస్పత్రుల్లో మృతిచెందిన వారే ఎక్కువ. ఉదాహరణకు..
► విజయవాడ కుమ్మరపాలేనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి డయాబెటిక్ బాధితుడు ఢిల్లీ వెళ్లి వచ్చారు. పాజిటివ్ లక్షణాలు సోకిన తర్వాత వారం రోజులకు గానీ ఆస్పత్రికి రాలేదు. చివరి నిముషంలో అంటే మార్చి 29న విజయవాడ జనరల్ ఆస్పత్రికి వచ్చారు. నమూనాల ఫలితం రాకముందే 30న మరణించారు.
► అనంతపురం జిల్లాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి పరిస్థితీ ఇంతే. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న ఇతనికి పాజిటివ్ వచ్చింది. చివరి క్షణాల్లో అంటే ఏప్రిల్ 4న ఆస్పత్రిలో చేరారు. అదేరోజు సాయంత్రం మృతిచెందారు.
► అనంతపురం జిల్లాకే చెందిన మరో 70 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి కరోనా సోకింది. నాలుగైదు రోజులు ఆలస్యం చేశారు. ఈనెల 6న ఆస్పత్రిలో చేరారు. 7న మృతిచెందారు. 8న పాజిటివ్
అని రిపోర్టు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment