కుప్పకూలిన ఆటోమొబైల్‌ రంగం | Coronavirus Effect To Mobile Shops Are Closed In Vijayawada | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన ఆటోమొబైల్‌ రంగం

Published Sun, Mar 29 2020 10:32 AM | Last Updated on Sun, Mar 29 2020 10:32 AM

Coronavirus Effect To Mobile Shops Are Closed In Vijayawada - Sakshi

ఆటోనగర్‌ ప్రాంతం ఇదే..  

ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు): కరోనా వైరస్‌ ఆటోమొబైల్‌ రంగాన్ని కుదిపివేసింది. తీరని నష్టాన్ని మిగిల్సింది. ఎన్నడు లేని విధంగా దెబ్బతీసింది.ఇక కోలుకోలేని పరిస్ధితి తెచ్చిపెట్టింది. ఇక ఇక్కడకు నిత్యం వచ్చే సుమారు 80వేల మంది వివిధ రంగాల్లో పనిచేసే రోజువారి కార్మికులతో పాటు నెలవారి కార్మికులు  ఉపాధి కోల్పోయారు. వీరంతా ఏడు రోజుల నుంచి లబోదిబోమంటున్నారు. కనీసం బయటకూడా అప్పు పుట్టక నానా తంటాలు పడుతున్నారు. ఇక ప్రభుత్వమే ఆదుకోవాలంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఎలా బ్రతకాలో అర్ధంకాక తలపట్టుకుంటున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఇక్కడ 300లకు పైగా చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి. దిక్కుతోచని స్ధితిలో పరిశ్రమల యజమానులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పటికి కరోనా వైరస్‌ బారినుంచి బయట పడతామని కానరాని దేవుని వైపు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  

ఆసియా ఖండంలో నెంబర్‌వన్‌! 
ఆటోమొబైల్‌ రంగంలో  ఆసియా ఖండంలోనే   అతి పెద్దది ఆటోనగర్‌ మొదటి స్ధానం సంపాదించుకుంది. 1966లో విజయవాడలోని అప్పటికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా అప్పట్లో శంకుస్ధాపన చేశారు. అప్పటి నుంచి మొన్నటి వరకు దినదినాభివృద్ధి చెందుతోంది.  ఎంతో మందికి ఉపాధిగా మారంది. ఇక్కడ సుమారుగా 500 లకు పైగా లారీ బాడీబిల్డింగ్‌ షెడ్‌లు ఉన్నాయి. స్టెయిన్‌లెస్‌స్టీల్, అల్యూమినియం కంపెనీలు 100పైగాఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలతో పాటు పుడ్‌ ఇండస్ట్రీలు 20కి పైగా ఉన్నాయి. కాంక్రీట్‌ మిక్చర్‌లు తయారీలు సమారుగా 50కి పైగా ఉన్నాయి. ఇవికాకుండా మెకానిక్‌ షెడ్‌లు 2000 ఉన్నాయి.

అంతే కాకుండా రీబటన్‌ టైర్ల తయారుచేసేవి సుమారుగా 100కు పైగా ఉన్నాయి. డిస్పోజల్‌ లారీ విడిభాగాలు సంబంధించి సుమారు 200 పైగా ఉన్నాయి. ఎక్కడా దొరకని వస్తువులు ఇక్కడే దొరుకుతాయి.వివిధ రాష్ట్రాల నుంచి ఆటోనగర్‌కు వస్తుంటారు. ఇవి కాకుండా లారీలు సుమారు 5000 వేలకు పైగా ఉంటాయి. కార్పెంటర్‌లు, పెయింటర్స్, స్టిక్కరింగ్‌ తో పాటు పలు రంగాలకు చెందిన అసంఘటిత కార్మికులు కూడా అధికంగానే ఉంటారు. ఇంత పెద్ద రంగం గత ఏడు రోజుల నుంచి మూతపడటంతో ఇక్కడి కార్మికులతోపాటు పరిశ్రమల యజమానులు ఇది కోలుకోని దెబ్బ అని తీవ్ర స్ధాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోలుకోలేని దెబ్బ 
కరోనా వైరస్‌ కారణంగా కోలుకోని దెబ్బ తగిలింది. చరిత్రలో ఎప్పుడు చవిచూడలేదు. ఇంకా అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్ధితి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. 
 – ప్రసాద్, అల్యూమినియం కంపెనీ యజమాని, ఆటోనగర్‌

నష్టం అంచనా వేయలేం.. 
కరోనా వైరస్‌ మాజీవితాల్లో చీకటి నింపింది. అసలే నష్టాల్లో ఉంటే... కరోనా జీవితంలో కోలుకోని విధంగా ఆటోమొబైల్‌ రంగాన్ని దెబ్బతీసింది. దిక్కుతోచని పరిస్ధితిలో కొట్టుమిట్టులాడుతున్నాం. ఏమి చేయాలో తెలియక తలపట్టుకొని జీవిస్తున్నాం.  –గంధం వెంకటేశ్వరరావు, మెకానిక్‌  ఆటోనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement