కరోనా.. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్–19 పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ఆ నలుగురు బాధితులు కూడా చికిత్స అనంతరం కోలుకుని తిరిగి రావడంతో, ఆ ఊరు ఊపిరి పీల్చుకుంది.
పద్మనాభం(భీమిలి): పద్మనాభం మండలంలోని వెంకటాపురం గ్రామం కరోనాను జయించింది. గ్రామంలో నలుగురికి కరోనా సోకినప్పటికీ, అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. గ్రామంలో ఇంకెవరికీ వైరస్ లక్షణాలు లేకపోవడంతో పాటు ఆ నలుగురు రోగులు కూడా ఆరోగ్యవంతులై రావడంతో, దాదాపు మూడు వారాల అనంతరం ఆ ఊరిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గత నెల 17వ తేదీన లండన్ నుంచి స్వగ్రామమైన వెంకటాపురం వచ్చిన యువకుడికి అదే నెల 20వ తేదీన కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో 21న విశాఖపట్నం ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. 22వ తేదీన కరోనా పాజిటివ్‌గా గుర్తించి, ఆ యువకుడి కుటుంబ సభ్యులైన తండ్రి, తల్లి, సోదరి, నాన్నమ్మలతో పాటు 33 మందిని ఆస్పత్రికి తరలించారు.
వీరిలో యువకుడి నాన్నమ్మ మినహా మిగతా ముగ్గురికీ కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకడంతో వెంకటాపురం గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. 23రోజులు ఆ గ్రామస్తులు కంటిపై కునుకు లేక తల్లడిల్లారు. అయితే 29మందికి నెగెటివ్ రావడంతో వీరిని ఇళ్లకు పంపించారు. ఐదు రోజుల క్రితం చికిత్స పూర్తయి కోలుకున్న తర్వాత యువకుడిని, అతడి తండ్రిని డిశ్చార్జి చేశారు. సోమవారం యువకుడి తల్లి, సోదరి కోలుకోవడంతో వారిని ఇంటికి పంపించేశారు. వీరంతా వెంకటాపురం గ్రామంలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఊరుకు చుట్టుపక్కల గ్రామాలతో సంబంధం లేక ఉన్న వీరు ఇప్పుడు పక్క గ్రామాలకు ప్రవేశించేందుకు ఆటంకాలు తొలగడంతో గండం గట్టెక్కామని ఊపిరి పీల్చుకున్నారు.
కట్టడి చేశారిలా..
- కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాక వెంకటాపురం గ్రామస్తులు మూడు కిలోమీటర్ల పరిధిలోని రేవిడి, రౌతుపాలెం, పాండ్రంగి గ్రామాల్లోకి వెళ్లకుండా మూడు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
- రేవిడి జంక్షన్‌లో పగటి వేళల్లో ఒక ఎస్‌ఐ, ముగ్గురు పీసీలు, రాత్రి వేళల్లో ఇద్దరు ఏఆర్, ఇద్దరు సివిల్ కానిస్టేబుళ్లతో పోలీస్ పికెట్ ఇంకా కొనసాగుతోంది.
- వెంకటాపురం కళ్లాల్లో ఇద్దరు, పాండ్రంగి జంక్షన్‌లో ఒక కానిస్టేబుల్, ఇద్దరు టీచర్లతో పికెట్ నిర్వహించారు. ఏసీపీ రవిశంకరరెడ్డి ఆధ్యర్యంలో సీఐ విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పికెట్లు కొనసాగుతున్నాయి.
- కరోనా పాజిటివ్ కేసు నిర్థారణ అయిన 22వ తేదీ నుంచి వెంకటాపురం గ్రామంలో ప్రతి రోజు వెంకటాపురం, రేవిడి గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు.
- గ్రామంలో బ్లీచింగ్ జల్లడం, వెంకటాపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయడం చేస్తున్నారు. డ్రైనేజీల్లో పూడిక తీస్తున్నారు. కరోనా వైరస్ సోకిన బాధితుల ఇంటిని సోడియం హైపో క్లోరైట్‌తో మరింత శుద్ధి చేశారు.
టెన్షన్ తగ్గింది
మా గ్రామంలో కరోనా అదుపులోకి రావడంతో భయం పోయింది. ఎవరికి ఎలా ఉంటుందో అని భయపడుతుండేవాళ్లం. బయటి ఊరికి రాకపోకలు ఉండేవి కావు. ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. వైరస్ ప్రభావం తొలగిపోవడంతో రేవిడి గ్రామంలోకి వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నాం.
– బి.వెంకట సూర్యకుమార్, వెంకటాపురం
కల్లోలం నుంచి ప్రశాంతత
వెంకటాపురం గ్రామం కరోనా కల్లోలం నుంచి గట్టెక్కింది. కరోనా బాధితులు ఆస్పత్రిలో ఉన్నంత కాలం మా గ్రామానికి చెందిన వారు ఇళ్లు విడిచి బయటికి వచ్చే వారు కాదు. ఎప్పడు ఏం జరుగుతోందని ఆందోళన మధ్య కాలం గడిపాం. మా ఊరిలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది.
– ఎ.బంగారుబాబు, వెంకటాపురం
మంచి చికిత్స అందించారు
కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి ఆస్పత్రికి వెళ్లాం. మమ్మల్ని ఆస్పత్రిలో బాగా చూసుకున్నారు. ఇప్పుడు మా ఆరోగ్యం బాగుంది. రిపోర్ట్ నెగెటివ్ రావడంతో మమ్మల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసి ఇంటికి పంపించేశారు. గ్రామంలోనే ఉంటున్నాం.
– కరోనా బాధితుడు, వెంకటాపురం
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాం
కరోనా సోకినప్పటి నుంచి వెంకటాపురంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాం. వీధుల్లో బ్లీచింగ్ చల్లిస్తున్నాం. సోడియం హైపో క్లోరైట్‌ను పిచిచారీ చేయిస్తున్నాం. లాక్ డౌన్‌ను ఈ గ్రామంలో మరింత పకడ్బందీగా అమలు చేశాం. – జి.వి.చిట్టిరాజు, ఎంపీడీవో
Comments
Please login to add a commentAdd a comment