కుమారమంగళం వద్ద నగరి పట్టణానికి రాకపోకలు ఆపేస్తూ దారిమూసివేసిన తమిళనాడు పోలీసులు
సాక్షి, చిత్తూరు: కోవిడ్–19 వైరస్ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ వారంలో ముగియనుంది. మరో ఏడురోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితమైతే కరోనా వ్యాప్తిని నియంత్రించే అవకాశముంది. జిల్లాలో రెండు వారాల క్రితం ఒక పాజిటివ్ కేసు నమోదు కాగానే యంత్రాంగం ఉలిక్కిపడింది. తర్వాత వారం వరకు మరో కేసు జాడ లేకపోవడంతో కొద్దిగా ఊపిరిపీల్చుకుంది. ఈ క్రమంలో 1వ తేదీ నుంచి 5 లోపు వరసగా 16 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో పరిస్థితి మారిపోయింది. తాజాగా మరో 3 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 20కి చేరుకుంది. పక్కజిల్లాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు కాస్త తక్కువనే చెప్పాలి.
చిత్తూరు అంతర్రాష్ట్ర జిల్లాలకు సరిహద్దు కావడంతో లాక్‌డౌన్‌ను పోలీసులు సమర్థవంతంగా వినయోగించుకున్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో నిలువరిస్తున్నారు. అయితే స్థానిక ప్రజలను మాత్రం ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేయడంలో మాత్రం పూర్తిస్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే జనాన్ని రోడ్లపైకి అనుమతించారు. అదే సమయంలో ఇంటికి ఒక్కరు మాత్రమే రావాలని సూచించారు. కానీ, జిల్లావ్యాప్తంగా నిత్యం సగటున 4 వేల మంది బయటకు వస్తున్నారు. అందులో అవసరం లేకపోయినా వెలుపలికి వచ్చేవారి సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉంటుంది. ప్రస్తుతం సమాజం ఎలాంటి ఆపదలో చిక్కుకుని ఉందో ఏమాత్రం ఆలోచించడం లేదు. వీళ్లు ఇకనైనా మేల్కొని ఈవారం రోజులు ఇళ్లలో ఉంటే పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే.
ఈ వారం ఎంతో కీలకం
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1816 మందిలో 1810 మంది ఇప్పటికే రెండు వారాల గృహనిర్భందం (క్వారంటైన్) పూర్తి చేసుకున్నారు. వీళ్లుకాకుండా మరో 554 మంది జిల్లాలోని పలు ఆసుపత్రులు, హౌస్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఇందులో ఢిల్లీలోని జమాత్‌కు వెళ్లివచ్చిన వాళ్లు 163 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే 20 మంది మాత్రం జిల్లాకు చెందినవాళ్లు కాదని, మరొకరి ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. అంటే 142 మంది ఢిల్లీకి వెళ్లివచ్చినవాళ్లు క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటికే వారం రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న వీరందరికీ మరో ఏడురోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు లేకుంటే పెద్ద ప్రమాదం తప్పినట్లే.
జిల్లాలో తొలి కాంటాక్టు కేసు..
బుధవారం అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో తిరుపతిలో ఓ కేసు, నగరిలో రెండు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తిరుపతిలోని త్యాగరాజనగర్‌లో వెలుగుచూసిన కేసులో తండ్రి నుంచి కుమారుడికి వైరస్ సంక్రమించినట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లాలో తొలి కాంటాక్టు కేసు ఇదేకావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి మరోచోట తలెత్తకుండా ఉండాలంటే ప్రజలు స్వీయనియంత్రణ పాటించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment