ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పరీక్ష నిర్ధారణకు ఇకపై రోజులు, గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. అనుమానం ఉన్న వ్యక్తులు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే పరీక్షలు చేయించుకుని ఫలితాలను తెలుసుకోవచ్చు. తద్వారా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువమందికి పరీక్షలను చేసే నిర్ధారణ కిట్ తయారీలో తెలుగింటి శాస్త్రవేత్తల ప్రయత్నం ఫలించింది. త్వరలోనే పేటెంట్ (పీటీఓ) రాకతో వీరి కష్టానికి, పరిశోధనకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు రానుంది. ఈ బృందం సభ్యుల్లో గాలివీడు మండలం నూలివీడుకు చెందిన అమ్మాయి ఉండడం రాష్ట్రానికే గర్వకారణం.
రాయచోటి :వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం నూలివీడుకు చెందిన పట్టా వెంకటరమణారెడ్డి (హిందీ ఉపాధ్యాయుడు), వెంకటేశ్వరమ్మ కుమార్తె సుప్రజ కరోనా నిర్ధారణ కిట్ రూపొందిన సభ్యుల బృందంలో ఒకరు. హైదరాబాద్‌లో ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరిశోధక బృందంలో ‘‘మెదడు పని తీరు’’పై పరిశోధనలో ఈమె సభ్యురాలు. పదో తరగతి వరకు నూలివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి వరకు విద్యను కొనసాగించారు. పది ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఐఐటీ హైదరాబాద్‌లో చదువుతూ ఆసక్తి ఉన్న ‘‘మెదడు పని తీరు’’పై పరిశోధన రంగంలో రాణిస్తున్నారు.
రూ.350కే కరోనా నిర్ధారణ కిట్..
తాము సాధించిన ఫలితాలకు ప్రభుత్వ సహకారం లభిస్తే కరోనా వ్యాధి నిర్ధారణ కిట్‌ను రూ.550 కంటే తక్కువ ఖర్చుతోనే అంటే రూ.350కే తయారు చేయవచ్చని సుప్రజా చెబుతోంది. ఈ విషయంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సభ్యులతో కలిసి నిర్ణయించామన్నారు. కరోనా వైరస్ గుర్తింపు పరీక్షా కిట్ తయారీపై ఫోన్ ద్వారా ‘‘సాక్షి’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆమె మాటల్లోనే...
‘‘ఏ రంగంలో ఉన్నా పరిశోధనల ఫలితాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ క్రమంలో మా ఫ్రొఫెసర్ డాక్టర్ శివగోవింద్‌సింగ్, సీనియర్ సూర్యస్నాత త్రిపాఠీలతో కలిసి చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనపెట్టలేకపోయినా వైరస్‌ను అనతి కాలంలోనే గుర్తిస్తే మరొకరికి అంటకుండా నివారించవచ్చన్నదే ధ్యేయం. ఈ కిట్ ద్వారా 20 నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ అవుతుంది.
మా ల్యాబ్ క్లినికల్ ట్రయిల్స్ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించింది. పేటెంట్(పీటీఓ) కోసం దరఖాస్తు చేశాం. త్వరలోనే పేటెంట్ హక్కు కూడా వస్తుందన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం వ్యాధి నిర్ధారణకు ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తున్నాం. తొలుత ఈ విధానంలో పరీక్షా ఫలితాల కోసం ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వస్తోంది. ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర పద్ధతులు ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే కిట్‌ను అభివృద్ధి చేశాం. ఈ కిట్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.2400గా నిర్ణయించి పరీక్షలు చేస్తోంది. ప్రభుత్వాలు తగినంత పరికరాలను ఉపయోగించి కిట్ల తయారీపై దృష్టి సారిస్తే ఖర్చు లేకుండా తక్కువ సమయంలోనే ఈ కిట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చని’’ ఆమె అభిపారయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment