ప్రగతి దారిలో.. | Corporate College padalevanna illusions eliminate competition | Sakshi
Sakshi News home page

ప్రగతి దారిలో..

Published Thu, Apr 21 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

Corporate College padalevanna illusions eliminate competition



 సాక్షి ప్రతినిధి, కాకినాడ:  ప్రభుత్వ కళాశాలల్లో మంచి ఫలితాలు రావని తీవ్ర విమర్శలొస్తున్న నేపథ్యంలో ఆ ముద్రను చెరిపేసుకొనే ప్రయత్నం మొదలైంది. కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడలేవన్న భ్రమలను తొలగించే దిశగా అడుగులేస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతంలో ప్రగతి కనబరిచాయి. సరైన మౌలిక సదుపాయాలు లేనిచోట.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కళాశాలలు సైతం ఉత్తీర్ణత శాతం పెంచుకున్నాయి. ఈ సాఫల్యతలో అధ్యాపకుల కృషి కూడా గణనీయమే. అదనపు తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, పరీక్షలపై ప్రత్యేక తర్ఫీదు వంటివన్నీ ప్రభావాన్ని చూపించాయి. అయితే అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య గత ఏడాది వంద శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో గుర్తింపు పొందిన గొల్లప్రోలు జూనియర్ కళాశాల ఈ సంవత్సరం ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణతకే పరిమితమైంది. ఇందుకు.. సౌకర్యాల మాటెలా ఉన్నా అన్ని సబ్జెక్టులకూ బోధనా సిబ్బంది లేకపోవడమే కారణం. ఇక విలీన మండలాల్లోని కళాశాలలపై  
 
 రాష్ట్ర విభజన ప్రభావం తీవ్రంగా ప్రస్ఫుటమైంది. అప్పటివరకూ ఇక్కడ పనిచేస్తున్న తెలంగాణ  సిబ్బంది సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఆ పోస్టుల్లో మన రాష్ట్రానికి చెందిన అధ్యాపకులను నియమించడానికి నాలుగు నెలలు పట్టింది. ప్రభుత్వం ఉదాసీనత కారణంగా విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయారు. తర్వాత కొత్తవారిని నియమించినా వారు పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవడానికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఫలితమేమిటో వీఆర్ పురం ప్రభుత్వ జూనియర్ కళాశాలే ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ గత ఏడాది 72.5 శాతం ఉన్న ఉత్తీర్ణత ఈసారి 28 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

  జిల్లా కేంద్రమైన కాకినాడలోని పీఆర్ జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు రాసిన  218 మందిలో కేవలం 120 మాత్రమే (58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 42 శాతం ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి కాస్త పెరిగింది. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన 162 మందిలో 113 మంది గట్టెక్కారు. ఉత్తీర్ణత శాతం 50 నుంచి 70కి పెరిగింది. ఒకేషనల్ కళాశాలలో ఫస్టియర్ విద్యార్థులు 61.36 శాతం, సెకండియర్ 77 శాతం ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదికన్నా ఇది 27 శాతం అధికం. అలాగే అన్నవరం సత్యవతీదేవి కళాశాలలో ఫస్టియర్ 367 మందికి 247 మంది (67 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 289 మందికి 213 మంది పాసయ్యారు.   కాకినాడ రూరల్ నియోజకవర్గం వేళంగిలో మెర్లాస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది మొదటి సంవత్సరం 70 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 83.3 శాతం నమోదైంది.
 
  సెకండియర్‌లో గత ఏడాది జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానం సాధించగా, ఈ ఏడాది 76 శాతం సాధించింది. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 481 మంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైతే వారిలో 287 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం గత ఏడాది నమోదైన 53.88 కన్నా కాస్త మెరుగుపడి 59.67 శాతం దగ్గర నిలిచింది.   కడియంలోని పిచ్చుక కోటయ్య జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది సాధించిన 76 శాతం నుంచి మెరుగుపడి ఈ ఏడాది 85 శాతం సాధించింది.
 
  కోరుకొండ మండలంలోని రాజబాబు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోగత ఏడాది సెకండియర్‌లో 72 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం 75 శాతానికి పెరిగింది. మండపేటలోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది సీనియర్ ఇంటర్‌లో 76 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 80.35 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రాయవరం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతేడాది 74 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 84.8 శాతం నమోదైంది.
 
  రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్‌లో మొత్తం 179 మంది పరీక్షలకు హాజరు కాగా 113 మంది ఉత్తీర్ణులయ్యారు. కాజులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్‌లో 106 మంది పరీక్షలకు హాజరు కాగా 84 మంది ఉత్తీర్ణులయ్యారు. కె.గంగవరం మండలం పామర్రులో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఫలితాలలో మొత్తం 58 మంది విద్యార్దులు హాజరు కాగా 57 మంది, ద్వితీయ సంవత్సరంలో 42 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్రాక్షారామ పీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్‌లో 56 మంది హాజరు కాగా 28 మంది ఉత్తీర్ణులయ్యారు.     
 
  ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72 నుంచి ఈసారి 89కి పెరిగింది. ఫస్టియర్ 64 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. గత ఏడాది సెకండియర్ ఫలితాల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించిన గురుకుల బాలికల కళాశాల ఈసారి 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఫస్టియర్‌లో 77 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది.
  సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో 51 శాతం నుంచి కేవలం 0.9 శాతం మాత్రమే ఉత్తీర్ణత పెంచగలిగింది. ఫస్టియర్ ఫలితాల్లో 36 శాతం నుంచి 45 శాతానికి మెరుగుపడింది.
 
  మామిడికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 65 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 72 శాతం సాధించింది.  పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాలలో సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 45.5 శాతం మాత్రమే నమోదైన ఉత్తీర్ణత శాతం ఈసారి 75 శాతానికి పెరిగింది. గొల్లప్రోలు కళాశాలలో గత ఏడాది వంద శాతం ఉత్తీర్ణత రాగా, ఈ ఏడాది 80 శాతం మాత్రమే వచ్చింది.
 
  కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఏడాది సెకండియర్ ఫలితాల్లో 69 శాతం ఉత్తీర్ణత రాగా ఈసారి పది శాతం మెరుగుపరచుకుంది. ఒకేషనల్ కోర్సుల్లో గత ఏడాది 70 శాతం కాగా ఈసారి 96 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఆలమూరు జూనియర్ కళాశాలలో గత ఏడాది సెకండియర్‌లో 61.16 ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 89 శాతానికి పెరిగింది.  ముమ్మిడివరం ఎంజీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 60 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 75 శాతం సాధించింది.
 
  రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రం ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం నుంచి 71 శాతానికి మెరుగుపడినప్పటికీ సెకండియర్‌లో మాత్రం 80 శాతంతో కేవలం 0.1 శాతమే మెరుగు సాధించగలిగింది.  రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల సెకండియర్ ఫలితాల్లో 49 శాతం నుంచి 75 శాతానికి పురోగమించింది. జగ్గంపేట కాలేజీ 49 నుంచి 59 శాతానికి, గోకవరం కాలేజీ 60.5 నుంచి 65 శాతానికి, కిర్లంపూడి కాలేజీ 52 శాతం నుంచి 72 శాతానికి ఉత్తీర్ణతను పెంచగలిగాయి.
  విలీన మండలాల్లో కూనవరం జూనియర్ కాలేజీలో గత ఏడాది సెకండియర్ ఫలితాల్లో 46 శాతమైన ఉత్తీర్ణత ఈ ఏడాది 23 శాతానికి పడిపోయింది. వీఆర్ పురం  కళాశాలలో గత ఏడాది 72.5 శాతం కాగా, ఈ ఏడాది 28 శాతమే వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement