నెల్లూరు(హరనాథపురం) : రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సేవల కోసం వచ్చేవారు దళారులను ఆశ్రయించవద్దు...నేరుగా కార్యాలయానికి వచ్చి సేవలు పొందవచ్చు.. దళారీ వ్యవస్థ రద్దు చేయబడింది.... ఇలా పెద్దపెద్ద అక్షరాలతో రాసిన బోర్డులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో దర్శనమిస్తుంటాయి. ఇది నిజమని పొరపాటు పడ్డారో అంతే.. మీ పనికి సంబంధించిన ఫైలు ఎట్టి పరిస్థితుల్లోను ముందుకు కదలదు. కార్యాలయ సమీపంలో తిరిగే దళారులను ఆశ్రయిస్తేనే మీకు సేవలు అందుతాయి. లేదంటే రకరకాల కొర్రీ లతో ఫైలు వెనక్కు వస్తుంది. కార్యాలయ ఉద్యోగుల అండదండల తో దళారులు దందా చేస్తూ ప్రజలను పీడిస్తున్నారు. మనకు పని కావాలే...పోతేపోనీ అంటూ జనం కూడా రాజీపడుతున్నారు.
దస్తావేజుల్లో సాంకేతిక అంశాలుండడంతో భవిష్యత్‌లో ఏమై నా ఇబ్బందులు వస్తాయేమోనని దళారులుగా వ్యవహరిస్తున్న కొందరు డాక్యుమెంటరీ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఏ పని కావాలన్నా అడిగినంత ఇవ్వాల్సిందే... ఒక్కో పనికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేశారు. ఆ మొత్తం చెల్లించకుంటే కొర్రీలు చూపి ఫైలును పక్కన పడేస్తారు. ఇటీవల కాలంలో నెల్లూరు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయించిన రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులకు రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాట్లకు సంబంధించి కొందరు డాక్యుమెంటు రైటర్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఇద్దరుముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్ చేయించి వివాదాలకు కారణమవుతున్నారు.
ఇటువంటి వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి దందాలో ఎక్కువ మంది డాక్యుమెంటు రైటర్లే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి దోచిపెడుతున్నారు. తామూ లబ్ధి పొందుతున్నారు. భూములు, ప్లాట్ల్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఖజానాకు జమ చేసే చలానా మొత్తంతో పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయ ఖర్చులు కూడా దళారులకే ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు నెలలుగా పెద్ద మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. రూ.100 కోట్లకు పైగా భూములు క్రయవిక్రయాలు జరిగాయి. ఇందుకు రూ.10 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది జేబుల్లో చేరినట్లు తెలుస్తోంది.
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల్లోనూ ఇదే పరిస్థితి
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు, గూడూరు డివిజన్లుగా విభజించారు. మొత్తం 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్ పేట, బుజబుజ నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. వేరే ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేయించాల్సిన పనులను కూడా ఆన్‌లైన్ ద్వారా ఇక్కడే చేయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
బుజబుజ నెల్లూరు శివారు ప్రాంతం కావడం, గూడూరులోని జిల్లా రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఉండడంతో ఆక్రమ రిజిస్ట్రేషన్‌కు ఈ కార్యాలయం అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. బుజబుజ నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ బోర్డును మూలనపడవేసి ఒక ఇంట్లో కార్యకలాపాలను నిర్వహిస్తుండడం గమనార్హం. కార్యాలయానికి వచ్చే వారికి ఏ స్థిరాస్తికి ఏ దస్తావేజులు, ప్రతులు సమర్పించాలో సూచించే బోర్డు కార్యాలయంలో లేదు. దీంతో సేవలకోసం వచ్చేవారు దళారులను ఆశ్రయిస్తున్నారు. రూ.500తో పూర్తి అయ్యే పనికి రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని మధ్యవర్తులు చెబుతారు.
అక్రమాలకు పాల్పడితే చర్యలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే చర్యలను తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ల సేవల కోసం వచ్చే వారు దళారులను ఆశ్రయించ వద్దు. అక్రమాలను అరికట్టేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. డాక్యుమెంటరీ రైటర్ల వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దస్తావేజులను ఎవరితో అయినా రాయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్లలో అసౌకర్యం కలిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. సత్యనారాయణరావు,
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్
కరప్షన్ కేరాఫ్ రిజిస్ట్రేషన్
Published Sun, Sep 7 2014 2:43 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement