పురపాలన గాలికి.. | Corruption charges on municipal office | Sakshi
Sakshi News home page

పురపాలన గాలికి..

Published Sat, Jan 25 2014 5:56 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Corruption charges on municipal office

చీరాల, న్యూస్‌లైన్: చీరాల పురపాలన గాడి తప్పింది. కౌన్సిల్ లేకపోవడం, కొన్నేళ్లుగా ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుండటంతో ప్రశ్నించే వారు లేక అధికారులదే ఇష్టారాజ్యమైంది. అభివృద్ధిలో వెనుకంజ..అవినీతిలో మాత్రం ముందంజలో ఉంది. మున్సిపల్ కార్యాలయంలో ఒక్కో శాఖలో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోయింది.  
 
 అడుగడుగునా అవినీతి...
 చీరాల మున్సిపాలిటీ అభివృద్ధి కంటే అవినీతిలోనే ముందంజలో ఉంది. కాసులు చెల్లించకుంటే దస్త్రాలన్నీ పెండింగ్‌లో పడి మగ్గాల్సిందే. కాసులు కొడితే మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలి అడ్డగోలుగా పనులు చక్కబెడుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతికి అంతూపొంతూ లేకుండాపోయింది. అపార్టుమెంట్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించడంతో పాటు కొన్ని అంతస్తులు అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నా ఎవరూ పట్టించుకొనే వారు లేరు.
 
 పేరాల పోస్టాఫీసు సెంటర్ రోడ్డు మాస్టర్‌ప్లాన్ ప్రకారం విస్తరణలో ఉన్నప్పటికీ అక్కడ పెద్ద భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించినా వారి వద్ద కాసులు తీసుకొని టౌన్‌ప్లానింగ్ అధికారులు మౌనంగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. అలానే సంతబజారులో నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ భవనాన్ని నిబంధనలకు నీళ్లొదిలి నిర్మిస్తున్నా అధికారులు అడ్డగోలు నిర్మాణాలను పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 పట్టణంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఓ రేటు కట్టి వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణ నిధులతో పాటు పలు పథకాల ద్వారా వచ్చిన నిధులతో పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, ఇతర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ అధికార పార్టీ నాయకులు చెప్పిన వారి చేత ముందుగానే చేయించి ఆ తర్వాత ఎప్పుడో  ఈ - ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలుస్తున్నారు. ఒప్పందం ప్రకారం టెండర్లు పిలిచినప్పటికీ అందులో ఎవరూ పాల్గొనకూడదనే నిబంధన ఉంది. ఎవరైనా పాల్గొంటే లేనిపోని చిక్కులు వస్తాయని భావించి టెండర్ల జోలికి వెళ్లడం లేదు. దీంతో పోటీ లేక లక్షలాది రూపాయలు కాంట్రాక్టర్లు, అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి.
 
 కొన్నాళ్ల క్రితం కారుణ్య నియామకాల పేరుతో జరిగిన అక్రమాలు అన్నీఇన్ని కావు. నిబంధనల ప్రకారం ఒక కార్మికుడు చనిపోతే ఆ కుటుంబంలోని ఒకరికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ కుటుంబంలో ఉన్న వారికి కాకుండా మున్సిపల్ కార్మికుల నాయకుల కుటుంబాలకు, ఇతరులకు కట్టబెట్టారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. అలానే జనన, మరణాల మంజూరు విషయంలో అయితే బహిరంగంగానే ఆ శాఖల సిబ్బంది లంచాలు వసూలు చేస్తున్నారు. ధ్రువీకరణ పత్రం కావాలన్నా, ఏదైనా తప్పులను సరిదిద్దుకోవాలంటే వెయ్యి నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. లంచాలు ఇవ్వని వారికి రకరకాల ఆంక్షలు పెట్టి జాప్యం చేస్తున్నారు. ఏడు నెలలుగా 50 ధ్రువీకరణ పత్రాలు లంచాలు చెల్లించలేదని మున్సిపల్ అధికారులు నిలిపి వేశారంటే ఏ స్థాయిలో పరిపాలన జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
 
  మెప్మా పరిధిలో రుణం మంజూరుకు రూ.50 వేలకు రూ.5 వేల చొప్పున లంచంగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. పొదుపు రుణాలకు లక్ష రూపాయలకు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు కాంట్రాక్ట్ కార్మికులను కూడా వదిలి పెట్టడం లేదు. వారికి చెల్లించే జీతంలో రూ. 500 కమీషన్‌గా ప్రతినెలా వసూలు చేస్తున్నారు. అలానే నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలో ఉన్న చెత్త సేకరించే 18 ఆటోలకు లెసైన్సులు ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించుకోవాలి. కానీ  లెసైన్సులు ఉన్న వారికి అయితే ఎక్కువ జీతం చెల్లించాలనే ఉద్దేశంతో లేని వారిని 15 మందికి పైగా నియమించారు. ఈ అవకాశం కల్పించినందుకు గాను ఒక్కో డ్రైవర్ నుంచి రూ. 1500 ప్రతినెలా మున్సిపల్ అధికారులకు అందుతున్నట్లు సమాచారం.
 
 అభివృద్ధి ఏదీ...?
 పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి మాత్రం వెనుకంజలో ఉంది. రోడ్ల విస్తరణ కొన్నేళ్లుగా నత్తను తలదన్నేలా ఉంది. పది రోడ్లకు పైగా విస్తరణ జరగాల్సి ఉండగా కేవలం రెండు రోడ్లను, అదీ నామమాత్రంగానే విస్తరించారు. మిగిలిన రోడ్ల ఊసే లేదు. మోడల్ టౌన్ పేరుతో ముఖద్వారాలు, జంక్షన్ పాయింట్లు, పార్కులు నిర్మిస్తామని చెప్పిన యంత్రాంగం మాటలు హామీలుగానే మిగిలిపోయాయి. కోర్టు వివాదాల నేపథ్యంలో డంపింగ్ యార్డు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో చెత్తాచెదారంతో చీరాల రోడ్లు దర్శనమిస్తున్నాయి. చీరాలకు ల్యాండ్‌మార్క్ అయిన గడియార స్తంభాన్ని తొలగించి దాని స్థానంలో నిర్మించిన గడియార స్తంభం నిర్మాణం అధ్వానంగా ఉంది. ప్రధాన రోడ్లు గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొనే అధికారులు లేకపోవడం విశేషం.
 
 మున్సిపల్ కమిషనర్ ఏమంటున్నారంటే...
 ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ బి.దేవ్‌సింగ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే సంబంధిత సిబ్బందిపై  చర్యలు తీసుకుంటామన్నారు. అలానే మెప్మా విభాగంలో  సిబ్బంది లంచం తీసుకున్నట్లు లబ్ధిదారులు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో  సిబ్బందిని సస్పెండ్ చేస్తానని తెలిపారు. అలానే ఇంజినీరింగ్ విభాగంలో ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ పిలిచిన తర్వాతే సంబంధిత కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నామన్నారు. పనులు చేసే కాంట్రాక్టర్లలో బాపట్ల, ఒంగోలుకు చెందిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారని తెలిపారు. శానిటేషన్ విభాగంలో లెసైన్సులు లేని ఆటో డ్రైవర్లు లేరన్నారు. ప్రతి డ్రైవర్‌కు లెసైన్స్ ఉందని తెలిపారు. టెండర్లు పిలిచే సమయంలోనే సంబంధిత కాంట్రాక్టుదారుడికి కార్మికులకు లెసైన్సులు ఉంటేనే టెండర్ పాటలో పాల్గొనేలా షరతులు విధించామన్నారు. అయితే లెసైన్సు డ్రైవర్లు సెలవులు పెట్టిన సమయంలోనే బయటి డ్రైవర్లను నియమిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement