ఎదురే నాకు లేదు.. నన్నెవరూ ఆపలేరు!
► జిల్లాలో పర్సంటేజీలు ఇస్తేనే పనులు
► ఆర్‌అండ్ బీలో తారాస్థాయికి చేరిన అవినీతి
► కనిగిరి, కొండపి, దర్శి ముఖ్య నేతల దందా
► ప్రతీ పనికి కాంట్రాక్టర్లు మామూళ్లు ఇవ్వాల్సిందే
► ఇవ్వకుంటే టెండర్లు ఓపెన్ చేసేది లేదని హెచ్చరిక
► సంబంధిత అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు
► జిల్లా వ్యాప్తంగా నిలిచిన సుమారు రూ.100 కోట్ల పనులు
ఒంగోలు: టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతీ పథకం ఆ పార్టీ నేతలకు వరంగా మారింది. పథకం ప్రారంభించిన నాటి నుంచే అందులో లొసుగులు వెతకడం తెలుగు తమ్ముళ్లకు పరిపాటిగా మారింది. ఎక్కడా ఏ అవకాశం ఉన్నా అందులో నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. తామేం చేసినా అడిగేవారు లేరన్న ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. చేప్పేవి శ్రీరంగనీతులు చేసేవి అవేవే అన్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం నిజారుుతీకి తాను నిలువెత్తు నిదర్శనం.. అంటూ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. ఇంకుడు గుంతలు మొదలు, నీరు-చెట్టు పథకం, జలసిరి పథకం, ఫారం పాండ్స్, ఫింఛన్ల పంపిణీ, రేషన్‌కార్డుల మంజూరు, నివేశన స్థలాల పంపిణీ అన్ని పథకాల్లోనూ టీడీపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారు.
అధికార పార్టీ నేతలకు 12 శాతం మామూళ్లు ఇస్తే తప్ప.. జిల్లాలో కాంట్రాక్టర్లు పని చేసే పరిస్థితి లేదు. ఫలితంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. తాము చెప్పిన పర్సంటేజీ చెల్లించిన తర్వాతే టెండర్లలో పాల్గొనాలని పచ్చచొక్కా ముఖ్య నేతలు కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేస్తున్నారు. చేసేదిలేక చాలామంది కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకే జంకుతున్నారు. నిబంధనల మేరకు 5 శాతానికి మించి అదనంగా టెండర్ వేసేందుకు లేదు. టెండర్ మొత్తానికి ఒకటి, రెండు శాతం అదనంగా వేసినా పనులు దక్కించుకోవచ్చు. 10 నుంచి 12 శాతం నిధులు చెల్లిస్తేనే టెండర్లు వేసుకోవాలని, పర్సంటేజీ ఇవ్వకుండా టెండర్‌లు వేస్తే పనులు చేయలేరంటూ తమ్ముళ్లు బెదిరిస్తున్నారు.
ఒక్కో చోట ఒక్కో రేటు
కొండపి, పర్చూరు ప్రాంతంలో 10 నుంచి 12 శాతం పర్సంటేజీ వసూలు చేస్తున్నారు. కనిగిరి ప్రాంతంలో 7 శాతం, ఒంగోలుకు చెందిన ఓ ముఖ్యనేత 10 శాతం చొప్పున పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కనిగిరి, కొండపి, దర్శి తదితర ప్రాంతాల్లో కొందరు అధికార పార్టీ నేతల బెదిరింపులు శ్రుతిమించడంతో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, భవనాల శాఖలో ఈ పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు ఆ శాఖ మంత్రి కావడంతో ఇక్కడ అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నారు.
ఆ శాఖ పరిధిలో జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల పనులకు ఈ ఏడాది మార్చి 30న టెండర్లు పిలిచారు. వాటిలో కనిగిరిలో రూ.40 కోట్లు, కొండపిలో రూ.30 కోట్లు, దర్శిలో రూ.15 కోట్లకు చొప్పున పనులున్నాయి. బిడ్డింగ్ చివరి తేదీ అదే ఏడాది ఏప్రిల్ 22. ఏప్రిల్ 24 నాటికి టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉన్నా ఇంత వరకు రోడ్లు, భవనాల శాఖాధికారులు వాటిని ఓపెన్ చేయకపోవడం గమనార్హం. ఒకరిద్దరు కాంట్రాక్టర్లు స్థానిక అధికార పార్టీ ముఖ్యనేతలకు 7 శాతానికి మించి పర్సంటేజీ ఇవ్వలేమని చెప్పి టెండర్లలో పాల్గొన్నట్లు సమాచారం. తాము చెప్పిన పర్సంటేజీలు కాంట్రాక్టర్లు ఇవ్వకపోవడంతోనే టెండర్లను ఓపెన్ చేయకుండా అడ్డుకుంటున్నారు.
అభివృద్ధిపై ప్రభావం
అధికార పార్టీ ముఖ్యనేతలు పర్సంటేజీల గోలతో జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొందరు తమ పార్టీ నేతలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రస్తుత నిబంధనల మేరకు 5 శాతానికి మించి అదనంగా కోడ్ చేయడానికి లేదని, 12 శాతం పర్సంటేజీ అధికార పార్టీ ముఖ్యనేతలకు చెల్లిస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దీంతో జిల్లా పరిధిలో పనులకు టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా మొగ్గుచూపడం లేదు.