అర్ధవీడు: భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం అసైన్‌మెంట్ కమిటీ ద్వారా భూపంపిణీ చేస్తుంది.వారి అర్హతల ఆధారంగా రెండు నుంచి రెండున్నర ఎకరాల భూమి పంపిణీ చేస్తారు.మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన ఓ మాజీ సైనికోద్యోగి తన పేరు, తల్లి, భార్య,అక్క, కర్నూలు జిల్లాలో ఉన్న బంధువులకు 48 ఎకరాల ఆసైన్డ్ భూమి గుట్టుచప్పుడు కాకుండా దక్కించుకున్నారు. అదే గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి సహచట్టం ద్వారా సమాచారం సేకరించడంతో గుట్టురట్టయింది.
అధికారుల అండదండలు పుష్కలం
పాపినేనిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి కొత్తూరు వెంకటేశ్వరరెడ్డికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కోట్ల విలువైన భూమిని 2006, 2007 సంవత్సరాల్లో ఏకంగా 48 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టాలు పొందాడు. పాపినేనిపల్లె ఇలాఖాలోని 96/3, 797/5, 827/2, 797/3, 798/4, 827/1, 45/1సి, 45/1డి, 45/1ఎ, 45/1బి, 26/3, 861/2, 114/1, 796/1, 796/2 సర్వే నంబర్లలో ఆయన అక్రమ సామ్రాజ్యం విస్తరించి ఉంది. వెంకటేశ్వరరెడ్డి తన భార్య సిరివెళ్ల లక్ష్మీదేవిపై రెండు పట్టాలు, కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన తన బంధువులు గౌరెడ్డి పెద్ద రంగమ్మ పేరుతో రెండు పట్టాలు, గౌరెడ్డి తిమ్మారెడ్డి, గైరెడ్డి చిన్న రంగమ్మ, కర్నూలు జిల్లా సిరివెళ్లకు చెందిన వల్లెల వెంకటమ్మ, కోవెలకుంట్లకు చెందిన గౌరెడ్డి మహాదేవి పేర్లపై ఐదేసి ఎకరాలకు పట్టాలు తెచ్చాడు. చివరకు ప్రభుత్వం నిషేధించిన 841, 842, 862 సర్వే నంబర్లలోని భూమిని ఆక్రమించాడు. తల్లిదండ్రుల ఇంటి పేర్లు సైతం మార్చి పట్టాలు కైవసం చేసుకున్నాడు. ఇదంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగిందని ప్రజలు విమర్శిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు
అసైన్డ్ భూములకు సంబంధించి అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారు. వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన కాసులకు కక్కుర్తి పడి ఏకంగా 48 ఎకరాలకు అక్రమంగా పట్టాలు తెచ్చుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్, ఎస్‌ఐకు మాజీ సైనికోద్యోగి ఎన్.రంగారెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బినామీ పేర్లతో పట్టాలు పొందిన వెంకటేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకొని అర్హులైన నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం: జీఎస్‌ఎం ప్రసాద్
వెంకటేశ్వరరెడ్డి అనే మాజీ సైనికోద్యోగి అసైన్డ్ భూములకు అక్రమంగా పట్టాలు పుట్టించుకున్నట్లు నాకు ఇటీవల ఫిర్యాదు అందింది. గత అధికారుల హయాంలో అతడికి పట్టాలు వచ్చాయి. భూములు పరిశీలించి విచారించి చర్యలు తీసుకుంటాం.ఆయన మాజీ సైనికోద్యోగి. తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో సుమారు 50 ఎకరాల ఎసైన్డ్ భూములకు పట్టాలు తెచ్చుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారులు ఆయనకు సహకారం అందించారు. కాసులకు కక్కుర్తి పడి పెట్టమన్న చోట కళ్లు మూసుకుని సంతకం పెట్టేశారు. చివరకు పొరుగు జిల్లాలో ఉన్న తన బంధువుల పేర్లతో కూడా పట్టాలు తెచ్చుకున్నాడంటే అతడి పైరవీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో సైనికోద్యోగి సహచట్టం ద్వారా అతడి అక్రమల చిట్టాను విప్పడంతో విషయం గుప్పుమంది.
Comments
Please login to add a commentAdd a comment