ఊరించి ఉసూరుమనిపించడంలో టీడీపీ సర్కారు పండిపోయింది. ఏ హామీ ఇచ్చినా.. ఏ పథకం ప్రారంభించినా.. చెప్పేది ఒకటి.. ఆచరణలో అమలు చేసేవిధానం మరొకటి. చివరకు లబ్ధిదారులకు తలనొప్పి. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న గోకులం పథకంలో రైతుల పరిస్థితి కూడా ‘ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము’ అన్నట్లు తయారైంది. రోజుకో ఉత్తర్వుతో నిబంధనల వాత పెడుతుండటంతో పశుపోషకులు ‘పథకం మాకొద్దు బాబోయ్’ అంటున్నారు.
సాక్షి, మచిలీపట్నం : పాడి పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గోకులం’ పథకం ప్రభుత్వ విధానాలతో పాడి రైతులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. రోజుకో నిబంధన తెరపైకి తీసుకువస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గోకులం షెడ్డు నిర్మాణానికి చెల్లించే 90 శాతం సబ్సిడీని తాజాగా 70 శాతానికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే లబ్ధిదారుడి వాటాగా గతంలో రైతు రూ.10 వేలు చెల్లిస్తే.. ప్రస్తుతం రూ.30 వేలు చెల్లించాల్సి వస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
పశు పోషణను ప్రోత్సహించి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. జిల్లా వ్యాప్తంగా 6,000 దరఖాస్తులు అందాయి. అందులో 3,785 దరఖాస్తులకు పంచాయతీ అధికారుల నుంచి ఆమోద ముద్ర పడింది. అందులో 3004 నిర్మాణాలకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం 2934 పనులు పురోగతిలోఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టీకరిస్తున్నాయి.
తొలి ఉత్తర్వు ఇలా..
ఈ ఏడాది ఆగస్టు 7న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు మినీ గోకులంపై మార్గదర్శకాలను జారీ చేశారు. అరసెంటు పట్టా కలిగి సొంత స్థలంతో పాటు రెండు పశువులు ఉంటే యూనిట్ విలువ రూ.లక్షగా ఖరారు చేయగా అందులో రూ.90 వేలు రాయితీ ఇస్తారు. రైతు తన వాటా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు పశువులు ఉంటే సెంటు భూమి కావాలి. యూనిట్ ధర రూ.1.50 లక్షలు. ప్రభుత్వం రూ.1.35 లక్షలు ఇస్తుంది. లబ్ధిదారు రూ.15 వేలు భరించాలి. ఆరు పశువులున్న వారికి ఒకటిన్నర సెంటు స్థలం ఉండాలి. పాక నిర్మించుకుంటే రూ.1.80 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం రూ.1.65 లక్షలు ఇస్తే పశుపోషకులు రూ.18 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
రెండో ఉత్తర్వు
మినీ గోకులాల నిర్మాణాలకు సబ్సిడీతో పాటు యూనిట్ ధరను కూడా ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసింది. గతంలో రెండు పశువులున్న గోకులానికి రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.90 వేలు, నాలుగు పశువులున్న యూనిట్ ధరను రూ.1.50 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు, ఆరు పశువులున్న యూనిట్ ధరను రూ.1.80 లక్షల నుంచి రూ.1.70 లక్షలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు విభాగాల్లో ఎంపికైన లబ్ధిదారుల్లో చాలామంది ముందస్తుగా 10 శాతం డీడీలు చెల్లించారు. కొన్నిచోట్ల గుంతలు, మరికొన్ని చోట్ల పిల్లర్లు, ఇంకొన్ని రేకుల దశలో ఉన్నాయి. వీటికి 90 శాతం సబ్సిడీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ముందస్తుగా మంజూరైన, పనులు చేపట్టినా బిల్లుల ప్రతిపాదనలు పంపకుండా జాప్యం జరిగుంటే వీరంతా 30 శాతం తన వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత లేక రైతుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే 10 శాతం కట్టారు.. మరో 20 శాతం చెల్లించాలని అధికారులు కబురు పంపుతున్నారు. ఇది మరింత అలజడికి గురి చేస్తోంది.
సామాజిక గోకులాలదీ అదే తీరు
సామాజిక గోకులాల యూనిట్ ధరను రూ.21 లక్షల నుంచి రూ.13 లక్షలకు కుదించారు. ఇందులో రూ.11.70 లక్షలు ఉపాది నిధులు, రూ.1.30 లక్షలు పశుసంవర్ధక శాఖ నిధులు కేటాయిస్తారని తెలిపారు.
రైతుల పెదవి విరుపు
ఆర్భాటంగా ప్రారంభించిన పథకంలో సబ్సిడీ తగ్గించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. దరఖాస్తుకు ముందు ఊరించి.. అనంతరం సబ్సిడీని 70 శాతానికి తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతాయని రైతులు అంటున్నారు. నిర్మాణాలకు 10 శాతం మొత్తం భరిస్తే చాలని ప్రభుత్వం గతంలో జీవో ఇవ్వడంతో పాడి రైతులు జిల్లా వ్యాప్తంగా లక్ష్యానికి మించి దరఖాస్తు చేశారు. జిల్లాలో మూడు వేల మినీ గోకులాల నిర్మాణాలు లక్ష్యం కాగా సుమారు ఏడు వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. అయితే సబ్సిడీ తగ్గించడంతో రైతులు దరఖాస్తులను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment