చింతపల్లి: విశాఖ మన్యంలో వైద్య ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు అంతు లేకుండా పోయింది. కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ. కోట్లు కాజేసిన వైనం ఒకొక్కటిగా వెలుగులోకి వస్తోంది. ట్రెజరీ ఉద్యోగులతో కుమ్మక్కయి 2010 నుంచి 2014 వరకు సుమారు రూ.10 కోట్లు పక్కదారి పట్టించినట్లు ఖజానాశాఖ ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలినట్టు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో కిందిస్థాయి ఉద్యోగి ఒకరు ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజుతో కలిపి ఈ అక్రమాలకు పాల్పడినట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఉద్యోగి విశాఖపట్నంలో ఉన్నట్టు భోగట్టా. అప్పలరాజుతోపాటు ఆ ఉద్యోగి నోరువిప్పితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంతమంది అధికారుల పాత్ర ఉందనేది వెలుగులోకి వస్తుంది.
ట్రెజరీ ఉద్యోగి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి రికార్డులు అప్పగించకపోవడంతో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. ఆడిట్ అధికారుల విచారణ అనంతరం రికార్డులను పోలీసులకు అప్పగిస్తే దీనిపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లోని 13 పీహెచ్‌సీలలో అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిల్లో మొత్తం 43 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఏటా వీరి వేతనాలకు రూ.కోటి వరకు నిధులు అవసరం. ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు బడ్జెట్ నివేదికలను ఏడీఎంహెచ్‌ఓకు అందజేస్తారు.
అక్కడి నుంచి ఆశాఖ డెరైక్టర్‌కు నివేదిక చేరాక బడ్జెట్ విడుదల అవుతుంది. కానీ అవసరానికి మించి లేని కాంట్రాక్టు ఉద్యోగులను సృష్టించి 2010 నుంచి ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా అప్పటి ఏడీఎంహెచ్‌వో స్వప్నకుమారి ఈ అవినీతి వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా ఖజానా శాఖ ఉన్నతాధికారులకు నివేదికలు అందాయి. మొత్తం 280 మంది నకిలీ ఉద్యోగులను సృష్టించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2013-14 ఒక్క ఏడాదికే బోగస్ ఉద్యోగుల పేరిట రూ.2.87 కోట్లు పక్కదారి పట్టించిన విషయం వెలుగులోకి రావడంతో పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ యువరాజ్ ప్రత్యేక ఆడిట్‌బృందాన్ని నియమించారు.
2010 నుంచి చెల్లింపులపై కూడా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా పీహెచ్‌సీల రికార్డులను ట్రెజరీ అధికారులు స్వాధీనం చేసుకుని లేని కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రెజరీ అకౌంటెంట్ అప్పలరాజుకు సన్నిహితురాలైన చంద్రకళ, ట్రెజరీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకునిగా పని చేస్తున్న ఎస్.దారబాబుల పేరిట రూ.11 లక్షలు డీడీల రూపంలో చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దారబాబు పేరిట రూ.4.99 లక్షలు డీడీ నంబరు 18279969తో, చంద్రకళ పేరిట రూ.6.27 లక్షలు డీడీ నంబరు 18279934తో అకౌంట్‌లో జమ చేశారు. వీరిద్దరు అప్పలరాజకు సన్నిహితులు కాగా పీహెచ్‌సీలలో ఎటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు లేరని నిర్ధారణకు వచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా నమోదు చేసిన పేర్లు, వారి పేరిట చెల్లించిన డీడీల వివరాలను సేకరిస్తున్నారు.
ఆ ఉద్యోగి నోరు విప్పితేనే..
Published Wed, Nov 26 2014 3:03 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement