ప్రతి పనికి పైసలివ్వాలి
- సాంఘిక సంక్షేమ శాఖకు అవినీతి జబ్బు
- ఒక్కో హాస్టల్ నుంచి నెలకు రూ.2వేలు వసూలు
- ప్రొటోకాల్ పేరుతో మరో రూ.500
- పదోన్నతికి సప‘రేటు’ రూల్స్!
- చిన్నచిన్న పొరపాట్లు సహజమంటున్న డీడీ
మచిలీపట్నం : సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని పిల్లలు అర్ధాకలితో అలమటించినా పట్టించుకోని జిల్లా అధికారులు.. తమకు మామూళ్లు అందడం ఒక్కరోజు ఆలస్యమైనా వెంటనే ప్రతాపాన్ని చూపుతారు. వార్డెన్లపై చిందులేసి ఆకస్మిక తనిఖీలకు బయలుదేరుతారు. హాస్టళ్లలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని పిల్లలు ఆందోళన చేసినా కన్నెత్తి చూడని అధికారులు.. పిల్లలు తక్కువగా ఉన్నారు, పెద్దగా మామూళ్లు ఇవ్వలేమని విన్నవించిన వసతిగృహ సిబ్బందిపై మాత్రం మూడో కన్ను తెరుస్తారు... ఇలా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు అవినీతి జబ్బు పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడిపిన వారికే పనులు చేస్తున్నట్లు సమాచారం. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేసే వారికి గ్రేడ్-1 వార్డెన్లుగా పదోన్నతి ఇచ్చే అంశంలోనూ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వినవస్తున్నాయి.
నెలకు రూ. 2వేలు సమర్పించుకోవాల్సిందే..
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 160 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 15వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో హాస్టల్‌లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారికి మాత్రం నెలకు రూ.1,500లు, డివిజన్ అధికారికి రూ.500 చొప్పున ప్రతి నెలా వార్డెన్లు మామూళ్లు సమర్పించుకోవాల్సి ఉంది.
పిల్లల సంఖ్య తక్కువగా ఉందని, నెలకు రూ. 2వేలు చొప్పున ఇవ్వలేమని కోరినా, ఈ మొత్తాన్ని తగ్గించేందుకు అధికారులు అంగీకరించటం లేదని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. మరోవైపు ప్రొటోకాల్ పేరుతో ఒక్కో హాస్టల్ నుంచి నెలకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా వార్డెన్లు సకాలంలో నగదు చెల్లించకపోతే వారికి మెమోలు ఇవ్వటం, ఆకస్మిక తనిఖీలతో ఇబ్బందులు పెట్టడం రివాజుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.
పదోన్నతుల్లో కిరికిరి
సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వార్డెన్లకు ప్రతి సంవత్సరం పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్-1గా పదోన్నతి ఇచ్చేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. సీనియార్టీ ప్రకారం డిపార్ట్‌మెంటల్ టెస్టులు రాసి అర్హత పొందిన వారికి పదోన్నతులు ఇవ్వాలి. అయితే, ఈ శాఖ అధికారులు తమను ప్రసన్నం చేసుకున్న వారినే పదోన్నతుల జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు యూనియన్ నాయకులు కూడా చక్రం తిప్పి తమ అనుయాయులకు పదోన్నతుల కోసం తెరవెనుక మంత్రాంగం నడిపారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక్కొక్కరి నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అధికారులు ఇష్టానుసారంగా తయారు చేసి పంపిన జాబితాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆ ఫైలును వెనక్కి పంపినట్లు తెలిసింది. మరోసారి సక్రమంగా ఫైలును తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
15 నెలలుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు లేవు
సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 15 నెలలుగా వేతనాలు అందలేదు. తమకు వేతనాలు అందించాలని అవుట్ సోర్సింగ్ సిబ్బంది పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయింది.
ఆరోపణలు సహజం
సాంఘిక సంక్షేమ శాఖలో చిన్న, చిన్న పొరపాట్లు జరగవచ్చు. వీటిని భూతద్దంలో చూపుతూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖను అల్లరిపాలు చేస్తున్నారు. ప్రతి నెల మామూళ్లు వసూలు చేయటం అవాస్తవం. వార్డెన్లకు పదోన్నతులు ఇచ్చే అంశంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాం.
-మధుసూదనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ