నియంత పాలన
ఆ నలుగురు చెప్పిందే శాసనం
రాతపూర్వక ఆదేశాలుండవు
మామూళ్ల మత్తులో ఉన్నతాధికారులు
సంక్షేమశాఖలో రాజ్యమేలుతున్న అవినీతి
నెల్లూరు: సాంఘిక సంక్షేమశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఆ నలుగురు చెప్పిందే శాసనంలా ఉద్యోగులు నడుచుకోవాలి. అలా వినకపోతే ఆ అధికారికి చుక్కలు చూపిస్తారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖలో అయినవారికి ఆకుల్లో.. కానివారికికంచాల్లోఅన్నచందంగా సాగిపోతోంది. వారి గురించి వేలెత్తి చూపించే వారికి నోట్ల కట్టలు విసిరేస్తారు. అందుకే కొందరు ఉన్నతాధికారులు ఆ నలుగురు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి సంక్షేమశాఖను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో పనిచేసే నలుగురు ఫెవికాల్ వీరులు నియంతలా వ్యవహరిస్తూ ఉద్యోగులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
అడ్డుగా ఉన్న కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై బదిలీ చేసి అవసరం లేకపోయినా మరి కొందరిని తెచ్చిపెట్టుకున్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే కొందరు ఉద్యోగులను డిప్యుటేషన్లపై బదిలీ చేసి ఉన్నారు. జిల్లా కార్యాలయంలో 10 మంది గుమస్తాలు ఉండాలి. అయితే ప్రస్తుతం ఏడుగురే ఉన్నారు. అటెండర్లు ఆరుగురు ఉండాల్సి ఉంటే.. ప్రస్తుతం 13 మంది పనిచేస్తున్నారు. దీంతో ఒకరు చేసే పనిని ఇద్దరు, ముగ్గురు చేస్తున్నారు. ఫెవికాల్ వీరులకు ఎవరు అధికంగా మామూళ్లు సమర్పించుకుంటే వారికి కోరుకున్న చోటుకు పోస్టింగ్ వేస్తారు. అది కూడా రాతపూర్వకంగా కాదు. కేవలం మౌఖిక ఆదేశాలతోనే. ఇలా జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖలో పనిచేసే అనేక మంది ఉద్యోగులను మౌఖిక ఆదేశాలతో బదిలీచేసి పనిచేయించుకున్నారు.