అక్రమ ఆర్జితం
► దాతల టికెట్ల కుంభకోణంలో ఇంటి దొంగలెందరో?
► ఆర్జిత కార్యాలయం కేంద్రంగానే కుట్ర
► కొందరు సిబ్బంది చేతివాటం?
► తేల్చని టీటీడీ విజిలెన్స్
► గతంలో అభిషేకం టికెట్ల కుంభకోణం ఇక్కడే
టీటీడీ ఆర్జితం కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. గతంలో సంచలనం రేపిన అభిషేకం టికెట్ల కుంభకోణానికి ఈ కార్యాలయమే కేంద్రబిందువైంది. ఇప్పుడు నకిలీ వీఐపీ దర్శనం టికెట్ల వ్యవహారం కూడా ఇక్కడి నుంచే సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఇంటి దొంగల సహకారంతో బయటి దళారులు అక్రమంగా లక్షలాది రూపాయలు ఆర్జిçస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన వారి అండదండలతోనే ఇదంతా సాగుతున్నట్లు విచారణలో వెల్లడవడం గమనార్హం.
సాక్షి, తిరుమల: టీటీడీ దాతల నకిలీ పాస్‌బుక్ టికెట్ల కుంభకోణంలో ఇంటిదొంగల హస్తం ఉందని తెలుస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కేటాయించే ఆర్జిత కార్యాలయం పాత్రపై అనుమానాలున్నాయి. ఒకరిద్దరు సిబ్బంది కేంద్రంగానే ఈ కుట్ర జరిగినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఈ దిశగా టీటీడీ విజిలెన్స్, పోలీసు దర్యాప్తు సాగడం లేదనే తెలుస్తోంది.
పోలీస్ కస్టడీకి నిందితులు
టీటీడీ ట్రస్టులకు విరాళాలు సమర్పించిన దాతలకు ఇచ్చే వీఐపీ దర్శనంలో నకిలీ టికెట్ల కుంభకోణంలో ఇప్పటికే 14 మందిని పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. దాతలకు సంబంధించి నకిలీ పాసుపుస్తకాలు, టికెట్లు తయారు చేయడంలో ప్రధాన నిందితుడు కరణం వేణుగోపాల్‌తోపాటు ఎం.వెంకటరమణ, పార్థసారధి, నాగభూషణం, వీజీ నాయుడు, గణేష్, చలపతి, శ్రీనివాసులు, రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండోదశలో హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మూడో దశలో టీటీడీ సూపరింటెండెంట్ ధర్మయ్యను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని పోలీసు కస్టడీకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నారు.
ఇంటి దొంగల పాత్రపై ఆరోపణలు
దాతల టికెట్ల కుంభకోణంలో టీటీడీలోని కొందరు ఇంటిదొంగల చేతివాటంతోనే బయటి వ్యక్తులు అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇందులో టీటీడీ సూపరింటెండెంట్ ధర్మయ్యతోపాటు మరికొందరు ఉద్యోగుల హస్తం ఉన్నట్టు కేసు ప్రాథమిక విచారణలోనే పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. అయితే, ఈ కేసులో ఆర్జితం కార్యాలయం కేంద్రంగా పనిచేసే కొందరు అక్రమార్కుల చేతివాటం కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి.
ఈ కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన కొందరి ప్రమేయం ఉందని పట్టుబడిన నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ కుంభకోణంలో మరికొందరు సూత్రధారులు, పాత్రధారులు దర్జాగా తిరుగుతుండ డంతో ఆ దిశగా విచారణ సాగుతున్నట్టు లేదంటున్నారు.
పట్టించుకోని టీటీడీ విజిలెన్స్?
దేవస్థానంలో అక్రమాలు జరక్కుండా చూసేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ఉంది. ఇందుకోసం సీవీఎస్‌వో నేతృత్వంలో అదనపు సీవీఎస్‌వో, వీఎస్‌వోలు, ఏవీఎస్‌వోలు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, ధార్మిక సంస్థలో జరుగుతున్న అక్రమాలపై ఈ విభాగం అంతగా దృష్టి సారిస్తున్నట్టు లేదనే విమర్శలున్నాయి. దాతల పేరుతో నకిలీ టికెట్లతో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళుతున్నా ఏమాత్రం గుర్తించిన సందర్భం లేదు. ఇలా వందలాది పాసుబుక్‌లతో వేలాది టికెట్లను అక్రమార్కులు వాడేసుకున్నారు. దీంతో టీటీడీకి రూ.కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అయితే, ఈ కుంభకోణాన్ని గుర్తించడంలో టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్లక్ష్యం ప్రదర్శించింది.
‘ఆర్జితం’ కేంద్రంగానే అభిషేకం టికెట్ల కుంభకోణం
గతంలో అభిషేకం టికెట్ల కుంభకోణం ఆర్జితం కార్యాలయం కేంద్రంగానే వెలుగుచూసింది. అతిముఖ్యమైన అభిషేకం టికెట్లను ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటంతో అక్రమాలకు పాల్పడినట్టు టీటీడీ విజిలెన్స్ విభాగం, పోలీసులు గుర్తించారు.