
సాక్షి, తిరుమల : తిరుపతిలోని అలిపిరి వద్ద 67.9 కోట్ల రూపాయలతో 346 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. అదేవిధంగా... తిరుమలలో భద్రత పర్యవేక్షణకు రూ. 15 కోట్లతో 1050 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏటీసీ వద్ద క్యూలైన్ నిర్మాణం కోసం రూ. 17.21 కోట్లు, తిరుమలలో స్మార్ట్ డేటా వినియోగ ఏర్పాటుకై రూ. 2.63, పలమనేరు గోశాల అభివృద్ధికి రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు
శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమించినట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. విజయనగరంలోని పార్వతిపురంలో రూ. 2.97 కోట్లతో, శ్రీకాకుళంలోని సీతంపేటలో రూ. 2.83 కోట్లతో, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రూ. 2.97 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ. 2.27 కోట్లతో కళ్యాణమండప నిర్మాణం చేపడతామన్నారు.