అనంతపురం, ఉరవకొండ/కూడేరు: ప్రజలకు నాలుగు కాలాల పాటు సేవలందించాల్సిన రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్ సొంత లాభం చూసుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన నిర్మాణ సంస్థ.. అందునా అధికార పార్టీ అండదండలు.. కోట్లాది రూపాయల వ్యయం.. నాణ్యత పాటించకపోవడంతో రోడ్డు పూర్తయిన నెలల వ్యవధిలోనే కంకర తేలిపోయింది. అంతేకాదు.. అడుగడుగునా ఓ డొల్లతనం బయటపడుతోంది. ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన 75 కిలోమీటర్ల రోడ్డులో భాగంగా రాచానపల్లి వద్ద వంతెనతో పాటు పెన్నహోబిళం వద్ద మరో వంతెన నిర్మించారు. నాలుగు నెలల క్రితం పనులు పూర్తయ్యాయి. రయ్.. రయ్‌మంటూ దూసుకుపోవచ్చనుకున్న వాహన చోదకులు తాజా పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
నిర్మాణంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్థానికులు వాపోతున్నారు. ఉరవకొండ బైపాస్‌ను పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఆదేశాలతో 20 అడుగుల రోడ్డును కుదించినట్లు చర్చ జరుగుతోంది. స్థానిక టీడీపీ నాయకులు చందా వెంకటస్వామికి చెందిన భూములను కాపాడేందుకే ఈ కుదింపు చేపట్టినట్లు తెలుస్తోంది. పైపులైన్ నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిన వ్యవహరించారు. కేకే పెట్రోల్ బంకు వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో వేసిన డివైడర్లు కొద్ది రోజులకే ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల లేయర్ వేయకుండా వదిలేయడంతో కంకర తేలి గుంతలు పడ్డాయి. రోడ్డును నిశితంగా పరిశీలిస్తే.. ఎన్‌హెచ్‌ఏఐ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందునా.. టీడీపీ దత్తత సంస్థ కావడం వల్లే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది.
అసంపూర్తిగా డ్రైనేజీ పనులు
కూడేరు మండల పరిధిలోని కుష్టు రోగుల కాలనీ నుంచి శివరాంపేట గ్రామం వరకు రహదారి పనులు చేపట్టారు. కూడేరులో ప్రధాన రహదారికి ఇరువైపులా మూడు అడుగుల వెడల్పు, పొడవుతో నిర్మించిన డ్రెయినేజీలు నాసిరకంగా ఉన్నాయి. కొన్నిచోట్లఅసంపూర్తిగా వదిలేశారు. స్టేట్ బ్యాంక్ వద్ద ఇళ్ల ముందు డ్రైనేజీ నిర్మాణానికి కొన్ని నెలల క్రితం గుంతలు తీసినా ఇప్పటికీ నిర్మాణం చేపట్టని పరిస్థితి. అదేవిధంగా రెడ్డి హోటల్ వద్ద, ట్రాన్స్‌కో కార్యాలయం సమీపంలో డ్రెయినేజీలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి. రోడ్డు పూర్తయి నాలుగు నెలలు కూడా గడవక మునుపే విడపనకల్లు సమీపంలో ఇలా కంకర తేలింది. జిల్లాకు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్.. అందునా ఆ సంస్థ యజమాని అమిలినేని సురేంద్ర సొంత నియోజకవర్గం మీదుగా వెళ్తున్న రోడ్డు విషయంలో పాటించిన నాణ్యతను చూస్తే ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఆయన పాత్ర ఇట్టే అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment