బాలాజీనగర్‌లో అక్రమ కుళాయి బిగించిన దృశ్యం
అక్రమ కుళాయిలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులేఅక్రమాలకు పాల్పడుతున్నారు. భవన యజమానుల నుంచిఅక్రమంగా నగదు వసూలు చేసి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో అక్రమ కుళాయిలు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 కోట్లునష్టం వాటిల్లుతోంది. ఈ వ్యవహారంలో ఫిట్టర్లుకీలకప్రాత పోషిస్తున్నారు.
నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 1.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 32,200, విలీన పంచాయతీల్లో 6,000 కుళాయిలు ఉన్నాయి. నెల్లూరు నగరంలోని కుళాయిలకు రూ.2,400, పంచాయతీల్లోని కుళాయిలకు రూ.1,200 పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. అలాగే 765 కమర్షియల్ భవనాల నుంచి ఏడాదికి రూ.40 లక్షలు వసూలవుతోంది. కార్పొరేషన్‌కు ఏడాదికిమొత్తం రూ.8 కోట్లు ఆదాయం వస్తోంది.
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 15 వేలకు పైగా అక్రమ కుళాయిలు ఉన్నట్లు అంచనా. వీటి వల్ల కార్పొరేషన్ రూ.3.60 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతుంది. అధికారులు ఆన్‌లైన్ చేశామని, అక్రమ కుళాయిలు లేకుండా చేస్తామని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఫిట్టర్లు భవన యజమానుల నుంచి భారీగా వసూలు చేసి ఇష్టారాజ్యంగా అక్రమ కుళాయిలకు కనెక్షన్లు ఇస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలోని ఓ అధికారికి ఫిట్టర్లు ప్రతి నెలా రూ.లక్ష ఇవ్వాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నగదు అందుతుండడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. రెసిడెన్షియల్ భవనాలకు ఇంటి కుళాయి ఉన్నట్లు సృష్టించారు. నగరంలోని రెసిడెన్షియల్ భవన యజమానుల నుంచి ప్రతి ఏటా లక్షలు వసూలు చేస్తున్నారు.
అర్హత లేని వారికి..
కార్పొరేషన్ పరిధిలో ఫిట్టర్లు 22 మంది పని చేస్తున్నారు. వారిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఐటీఐ విద్యను పూర్తి చేశారు. మిగిలిన 14 మందికి సరైన విద్యార్హత లేదని తెలుస్తోంది. ప్రజారోగ్యానికి సంబంధించిన నీటి సరఫరాలో టెక్నికల్ సబ్జెక్ట్ కచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే కార్పొరేషన్ ఉన్నతాధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తూ అనర్హులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఎక్కడైనా నీటి పైప్‌లైన్ పగిలితే సమస్యను పరిష్కరించడంలో వారు విఫలమవుతున్నారు.
భలే డిమాండ్
కార్పొరేషన్‌లో ఫిట్టర్ పోస్ట్‌కు మంచి డిమాండ్ ఉంది. ఒక్కో పోస్ట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అధికారులకు, పాలకవర్గానికి ముట్టజెబుతున్నారని సమాచారం. ఇటీవల ఓ పోస్ట్‌కు ఇంజినీరింగ్ విభాగంలోని ఉన్నతాధికారికి రూ.70 వేలు అందినట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అక్రమ కుళాయిలపై విజిలెన్స్ కన్ను
అక్రమ కుళాయిలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వాటిని క్రమబద్ధీకరించాల్సిన ఫిట్టర్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు తప్ప కుళాయి కనెక్షన్‌లు కార్పొరేషన్ నీటి పైప్‌లైన్ నుంచి ఇవ్వలేరు. ఫిట్టర్ కింద ఉండే సిబ్బంది ద్వారా రాత్రికి రాత్రే తవ్వకాలు జరిపి బిగిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై వారు విచారణ చేస్తున్నారు.
ఫిట్టర్ సస్పెన్షన్
అక్రమ కుళాయిల ఏర్పాటుకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ అనే ఫిట్టర్‌ను ఇటీవల కమిషనర్ అలీంబాషా సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో మరో ఫిట్టర్‌పై కూడా ఫిర్యాదులు రావడంతో విచారించి సస్పెండ్ చేయనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment