
కాకినాడ జీజీహెచ్‌లో బాధితుడితో మాట్లాడుతున్న కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయిం అస్మి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19 వైరస్ జిల్లాలో బుధవారం కలకలాన్ని రేకెత్తించింది. వైరస్ సోకిందనే అనుమానంతో కోనసీమకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కాకినాడ సామాన్య ఆస్పత్రి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్‌ను ప్రకటించింది. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయిం అస్మి కాకినాడ జీజీహెచ్‌లో ఏర్పాట్లను వైద్యం అందుతున్న తీరును బుధవారం స్వయంగా పరిశీలించారు.
తూర్పుగోదావరి, కొత్తపేట/ముమ్మిడివరం: దక్షిణ కోరియా వెళ్లి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) డాక్టర్ బి.సత్యసుశీల పర్యవేక్షణలో అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సీహెచ్ పుష్కరరావు ఆధ్వర్యంలో వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎంవీవీఎస్ శర్మ, వానపల్లి, అవిడి పీహెచ్‌సీల సిబ్బంది గ్రామంలో అనారోగ్య పరిస్థితులు, వ్యాధి లక్షణాల గుర్తింపు చర్యలు చేపట్టారు. సచివాలయాల సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
దక్షిణ కొరియా టు గోదశివారిపాలెం
కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ ద్వారా దక్షిణ కొరియాకు ట్రైనింగ్‌కు జనవరి 21న వెళ్లాడు. అతడిని నెల రోజుల పాటు కంపెనీకి రావద్దని, ఇంట్లోనే ఉండమని యాజమాన్యం చెప్పడంతో ఫిబ్రవరి 22న తిరిగి న్యూఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి అదేరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి మూడు రోజులపాటు అక్కడే ఉంచుకుని పంపేశారు. హైదరాబాద్‌లో ఉన్న వెంకటేశ్వర్లు గత నెల 28న ట్రావెల్ బస్‌లో బయల్దేరి నేరుగా 29న అత్తవారి ఊరు ముమ్మిడివరం మండలం ఠానేల్లంక శివారు గోదశివారిపాలెం గ్రామానికి చేరుకున్నాడు. అదేరోజు పుట్టింటికి వాడపాలెం వచ్చి రెండు రోజులు ఇక్కడే ఉండి రెండో తేదీన తిరిగి గోదశివారిపాలెం వెళ్లాడు. మంగళవారం అతడికి దగ్గు, జలుబు రావడంతో ఆయన ఎయిర్‌పోర్టులో తనకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించారు. అయితే వారు కరోనా లక్షణాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు తన స్నేహితుడి ద్వారా కాకినాడలో ఒక వైద్యుడిని సంప్రదించగా అతడు దక్షిణ కొరియా నుంచి రావడం, అక్కడ కరోనా తీవ్రత నేపథ్యం, అనారోగ్య లక్షణాలను బట్టి వెంటనే జీజీహెచ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆ వైద్యుడు సూచించినట్టు సమాచారం. అయితే అతను ఆ మేరకు వైద్య పరీక్షలకు వెళ్లకపోవడంతో ఆ వైద్యుడు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం రాత్రి ఆ వ్యక్తి కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆరా తీసి వాడపాలేనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే అతను అత్తవారి గ్రామం గోదాశివారిపాలెంలో ఉన్నట్టుగా తెలుసుకుని అక్కడికి వెళ్లి అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. (చదవండి: ఏపీలో హైఅలర్ట్)
వాడపాలెంలో కరోనా వైరస్ అనుమానితుడి ఇంటిని పరిశీలిస్తున్న డీఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ సత్యసుశీల
వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటా సర్వే
ఈ కరోనా వైరస్ అనుమానిత వ్యక్తి గురించి బుధవారం ఉదయానికి వాడపాలెం, గోదాశివారిపాలెం ప్రాంతాల్లో కలకలం రేగింది. డీఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ సత్యసుశీల ఆదేశాల మేరకు ఏడీఎం అండ్ హెచ్‌ఓ పుష్కరరావు ఆధ్వర్యంలో వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎంవీవీఎస్ శర్మ అప్రమత్తమయ్యారు. సిబ్బందితో వాడపాలెం చేరుకున్నారు. అనుమానిత వ్యక్తి ఇంట్లో అతడి తల్లితో పాటు ఉంటున్న పెదనాన్న, పెద్దమ్మలను ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.వెంకటేశ్వర్లు అత్తమామలు మల్లికార్జునరావు, అనురాధ, భార్య భద్రవీణ, ఏడాది కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. వారికి ఎటువంటి వైద్యపరీక్షలు నిర్వహించలేదు. అయితే ఇంటి నుంచి బయటకు రావద్దని వైద్య సిబ్బంది, సూచించారు. వానపల్లి, అవిడి పీహెచ్‌సీల సిబ్బందిని ఐదు బృందాలుగా విభజించి దగ్గు, జలుబు పీడితుల గుర్తింపునకు, వైరస్ అనుమానిత వ్యక్తి ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటా సర్వే చేపట్టారు. అలాగే గ్రామంలో సచివాలయాల అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు.
ట్రావెల్ బస్‌లో ప్రయాణించిన వారందరికీపరీక్షలు: డీఎం అండ్ హెచ్‌ఓ సత్యసుశీల
కరోనా వైరస్ అనుమానిత వ్యక్తి హైదరాబాద్ నుంచి అమలాపురం వరకు ప్రయాణించిన ట్రావెల్ బస్‌లోని 40 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని డీఎంఅండ్ హెచ్‌ఓ సత్యసుశీల తెలిపారు. వారందరికీ ఫోన్లు చేశామన్నారు. బుధవారం ఆమె వాడపాలెం చేరుకుని సంబందిత వ్యక్తి ఇంటిని, పరిసరాలను పరిశీలించారు. అలాగే కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న అతడిని పరీక్షించగా, వ్యాధి లక్షణాలేమీ లేవని, అయినా రక్త నమూనాలు తీసి పూణె లేబొరేటరీకి పంపించామన్నారు. రిపోర్టు 48 గంటల్లో వస్తుందన్నారు. ఈ వ్యక్తితో కలిపి ఇంతవరకూ ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించి రక్త నమూనాలు టెస్ట్‌కు పంపించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment