విపత్కర పరిస్థితుల్లో సీపీఐ, బీజేపీ
Published Thu, Aug 29 2013 2:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : జిల్లాలో సీపీఐ, బీజేపీలు విపత్కర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పార్టీపరంగా చేపట్టే అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలకు ఇవి దూరమయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైన ప్పటి నుంచి ఈ రెండు పార్టీలకు ప్రత్యేక కార్యక్రమాలే లేకుండాపోయాయి. ప్రతిఅంశాన్నీ ప్రజాసమస్యగా భావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే సీపీఐ, బీజేపీల్లో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. ఈ రెండు పార్టీలు సమైక్యాంధ్ర ఉద్యమాలకు దూరంగా ఉంటున్నాయి. ఈ రెండు పార్టీల అధినేతలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమైంది.
ప్రతిఘటన ఎదురవుతుందనా..?
జిల్లాలో నిరసన ఉద్యమాలు, ఆందోళనలకు సీపీఐ పెట్టింది పేరు. ఏదేని ప్రజాసమస్యను భుజాన వేసుకుని పార్టీ కార్యకర్తలు ఎర్రజెండాలతో రోడ్లమీదకొస్తేనే ఆందోళనలకు సరైన అర్థం అవగతమవుతుంది. ఆగస్టు ఒకటోతేదీ తరువాత సీపీఐ తరపున ఏవిధమైన ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు, ప్రదర్శనలు లేకుండా పోయాయి. జిల్లాలో మహోజ్వలంగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను పార్టీ నాయకులు నిశితంగా గమనిస్తున్నారే తప్ప, అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు. సమైక్యవాదుల మనోభావాలు దెబ్బతినకుండా అనిశ్చితంగా పార్టీ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు.
వాస్తవంగా ఇదే పార్టీలోని శ్రేణుల్ని పలకరిస్తే అధిక శాతం మంది అంతర్గతంగా సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న ప్రత్యేక తెలంగాణ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో కాస్తోకూస్తో కేడర్ కలిగిన భారతీయ జనతాపార్టీ పరిస్థితి ఇలానే ఉంది. అడపాదడపా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి వినతిపత్రాల అందజేత ద్వారా ఉనికిని కాపాడుకుంటున్న బీజేపీ.. సమైక్య ఉద్యమాలు మొదలైనప్పటి నుంచీ నోరుమెదిపే పరిస్థితిలో లేకుండాపోయింది. ఒకవేళ ఏదేని అంశాన్ని తీసుకుని ఆందోళనకు దిగితే సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందేమోనన్న అనుమానం పార్టీ నేతల్లో ఉంది.
దీంతో ఈ పార్టీ తరపున గత మూడు వారాలుగా జరిగిన పార్టీ కార్యక్రమాలేవీ లేకుండా పోయాయి. చిన్న రాష్ట్రాలకు బీజేపీ కట్టుబడి ఉందనీ, అదే మాటపై తామూ నిలబడి ఉన్నామని జిల్లా నేతలు అంటున్నారు. ఏదిఏమైనా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం సాగినంతకాలం ఈ రెండు పార్టీల నుంచి ఆందోళన కార్యక్రమాలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Advertisement