ఎన్జీవోలపై సీపీఐ శ్రేణుల దాడి | cpi leaders are attacked on ap ngos | Sakshi
Sakshi News home page

ఎన్జీవోలపై సీపీఐ శ్రేణుల దాడి

Published Sat, Jan 4 2014 3:11 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

cpi leaders are attacked on ap ngos

 ఏలూరు సిటీ/ఫైర్‌స్టేషన్‌సెంటర్, న్యూస్‌లైన్ :
 ఏలూరు వచ్చిన సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.నారాయణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎన్జీవోలపై సీపీఐ కార్యకర్తలు, నాయకులు దాడికి దిగారు. కర్రల్ని చేతబూని సీపీఐ కార్యాలయం ఎదుట స్వైరవిహారం చేశారు. వివరాల్లోకి వెళితే... సీపీఐ నాయకులకు ఏలూరులో రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్జీవోలు స్ఫూర్తి భవన్‌గా పిలిచే ఆ పార్టీ కార్యాల యం ఎదుట బైఠారుుంచారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తున్న సీపీఐ తన వైఖరి మార్చుకోవాలని, సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఎన్జీవోలు, సమైక్యవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీపీఐ నాయకులు, కార్యకర్తలు కర్రసాములు చేస్తూ ఎన్జీవో నేతలపై దాడులకు పూనుకున్నారు. పరిస్థితి అదుపుతప్పటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏడుగురు ఎన్జీవో నాయకులను అరెస్ట్ చేసి వాహనాల్లో బలవంతంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతావారిని అక్కడినుంచి తరిమివేశారు. సీపీఐ కార్యాలయం వద్దనుంచి జనం వెళ్లిపోయాక పార్టీ శ్రేణుల కర్రసాముల మధ్య నారాయణ అక్కడకు చేరుకున్నారు.
 
 పోలీస్ స్టేషన్ ఎదుట బైఠారుుంపు
 ఎన్జీవో నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారనే సమాచారం తెలిసి ఉద్యోగ సంఘాల నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయకులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయిం చారు. ఎన్జీవో నాయకులను వెంటనే విడుదల చేయూలని, సీపీఐ నాయకులతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదులు, ఎన్జీవోలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్దపెట్టున నినదించారు. సుమారు రెండు గంటలకు పైగా పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగింది. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చివరకు సీపీఐ నాయకులు పోలీస్‌స్టేషన్ వచ్చి టూటౌన్ సీఐ కె.విజయపాల్, ఎస్సై కిషోర్‌బాబు సమక్షంలో ఎన్జీవో నేతలకు క్షమాపణ చెప్పటంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
 
 విభజనకే కట్టుబడి ఉన్నాం : నారాయణ
 ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విలేకరులతో మాట్లాడుతూ బంద్ సంద ర్భంగా సీపీఐ రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయలేదన్నారు. ఎప్పుడో నిర్ణయిం చిన షెడ్యూల్ మేరకే ఇక్కడకు వచ్చినట్టు స్పష్టం చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయా లు సహజమని, సీపీఐ విభజనకు కట్టుబడి ఉన్నమాట వాస్తవేమని చెప్పారు. అయితే తమ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయటం లేదన్నారు. తాము మొదటినుంచీ తెలంగాణ ఇవ్వాలని కోరుతున్నామని, రెండు కళ్లు, మూడు కళ్లు, నాలుగు కాళ్ల సిద్ధాంతాలంటూ ప్రజలను మోసం చేయలేదన్నారు. విడిపోతే వచ్చే సమస్యలపై మాట్లాడే నాయకులు లేరన్నారు. గోదావరి జలాలు, పోలవరం, రాయలసీమలో జల వనరుల సమస్యలపై స్పష్టమైన హామీలు పొందాలని సూచించారు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కొల్లేరులో చేపల చెరువుల లెసైన్సులు, పదవులు కావాలి తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామంటోందని అప్పటినుంచి ఈ నాయకులు ఏంచేశారని నారాయణ ప్రశ్నించారు.  
 
 దాడి దారుణం
 సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఎన్జీవో నాయకులపై అమానుషంగా దాడిచేసిన సీపీఐ కార్యకర్తలు, నాయకులు తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నాయకులు మాగంటి బాబు, బడేటి బుజ్జి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బంద్ పాటిస్తున్న సమయంలో సీపీఐ నారాయణ ఇక్కడకు వచ్చి ఎన్జీవో నేతలపై దాడులు చేయించటం సరికాదని అభిప్రాయపడ్డారు.
 
 ఎన్జీవో నేతలకు సంఘీభావం
 అరెస్ట్ అయిన ఎన్జీవో నేతలు సీహెచ్ శ్రీనివాస్, జి.శ్రీధర్‌రాజు, ఆర్‌ఎస్ హరనాధ్, చోలంగి రామారావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాస్‌లకు వైసీపీ, టీడీపీ నాయకులతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఊదరగొండి చంద్రమౌళి, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, గుడిదేశి శ్రీనివాస్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నారా రామకృష్ణ, సిరిపల్లి ప్రసాద్, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు, కో-కన్వీనర్ జి.రాంబాబు ఉన్నారు.
 
 సీపీఐ అభిప్రాయం మార్చుకోవాలి : ఆళ్ల నాని
 ఎన్జీవోలకు మద్దతుగా పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సీపీఐ కూడా సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఎన్జీవో నేతలపై సీపీఐ కార్యకర్తలు దాడులకు దిగటం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement