అనంతపురం జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న సీపీఐ నేతలను పోలీసులు..
అనంతపురం : అనంతపురం జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తరలించారు. సోమవారం ఉదయం సీఎం జిల్లాలో పర్యటించనున్నసందర్భంగా జిల్లా సమస్యలను విన్నవించేందుకు సీపీఐ నేతలు ప్రయత్నించారు. ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, నేతలు నారాయణ. జాఫర్ తదితరులను పోలీసులు ఉదయం అడ్డగించి అరెస్ట్ చేశారు. సీఎం పర్యటనలో గొడవ చేసేందుకు సీపీఐ నేతలు పథకం పన్నారని పోలీసులు వాధిస్తున్నారు.
విషయం తెలుసుకున్న సీపీఐ శ్రేణులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీపీఐ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ నేతలను విడిచి పెట్టాలని వారు స్టేషన్ ముందు బైఠాయించారు. సీఎం పర్యటన ముగిశాక వారిని వదులుతామని పోలీసులు చెప్పడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.