
'ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెడతారా'
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అడిగిన సీపీఐ నాయకులను జైల్లో పెడతారా..?
అనంతపురం టౌన్: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అడిగిన సీపీఐ నాయకులను జైల్లో పెడతారా..? రాష్ట్రాభివృద్ధి కోరడం తప్పా..? వారేమన్నా సంఘ విద్రోహ పనులు చేశారా..? హామీలు ఇచ్చి నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు బాగున్నారు. అడిగిన వారిపై కేసులు పెడతారా.. అంటూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అమలు కోరుతూ కేంద్ర కార్యాలయ ముట్టడి సందర్భంగా అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకులను పరామర్శించేందుకు శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చారు.
అరెస్టులకు నిరసనగా సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటర్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. కేంద్రం తోక పట్టుకుని నడుస్తున్న టీడీపీ సైతం అడగడం లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ రాష్టానికి అన్యాయం చేస్తున్న వారు బయట ఉంటే, అభివృద్ధి జరగాలంటూ సీపీఐ పార్టీ ఉద్యమిస్తే దేశద్రోహం చేసినట్లుగా జైలులో పెట్టారంటూ మండిపడ్డారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఉద్యమం ఆగదని ఆయన హెచ్చరించారు.