
'నిస్సహాయ స్థితిలో చంద్రబాబు'
కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు.
తిరుపతి: కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తనదైన శైలిలో విసుర్లు విసిరారు. హరికథలో పిట్టకథలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తిరుపతి నగరం అంతకూడా లేని సింగపూర్ కు ఏపీ సీఎం తరచూ వెళ్లడం దేనికి ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకొస్తోందన్నారు. ప్రజలకు పంగనామాలు పెట్టి పెద్ద పెద్ద భవనాల్లో పాలన చేస్తే ఉపయోగం ఏంటని నిలదీశారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పరిపాలన చేసినా హర్షించే వాళ్లమని చెప్పారు.
విజయమాల్య తరహాలో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో చక్కుర్లు కొడుతున్నారని.. చివరకు ఆయనకు పట్టిన గతే పడుతుందేమో చెప్పలేమన్నారు. రాజధాని పేరుతో హంగామా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందని నారాయణ అన్నారు.