వైఎస్ జగన్ను అభినందించిన రామకృష్ణ
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అభినందించారు. ఆదివారం అనంతపురంలో కె.రామకృష్ణ మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ నేతల అరెస్ట్పై వైఎస్ జగన్ బాగా స్పందించారని తెలిపారు. తమపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు... అలాగే తమ అరెస్ట్కు నిరసనగా వైఎస్ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం అభినందనీయమన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అసెంబ్లీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని... ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు కె.రామకృష్ణ వివరించారు.
ప్రత్యేక హోదా అంశంపై సీపీఐ రామకృష్ణ అనంతపురం జిల్లాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు ఉపసంహరించుకుని... ఆయన్ని విడుదల చేయాలన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చారు. ఆ క్రమంలో ఇదే అంశంపై వైఎస్ జగన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అలాగే వైఎస్ జగన్పై అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు వ్యక్తిగత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం అనంతపురంలో జిల్లా కరువుపై పల్లె రఘునాథరెడ్డి నివాసాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్బంగా పల్లె రఘునాథరెడ్డితో భేటీ అనంతరం కె.రామకృష్ణ విలేకర్లతో మాట్లాడారు.