కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయకేసులో దోషుల కు శిక్షపడి వారం రోజులు గడవకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిస్సహాయురాలైన ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. జిల్లాలో సంచలనం రేకెత్తించిన ఈ దారుణం బుధవారం అర్ధరాత్రి కొత్తపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. అడ్డాకుల మం డలానికి చెందిన ఓ మహిళ(40) కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు వెళ్లి అర్ధరాత్రి సమయం లో కొత్తకోట బస్టాండ్‌లో బస్సు దిగింది. అర్ధరాత్రి కావడం, తన ఊ రికి వెళ్లేందుకు వీలుపడకపోవడంతో బస్టాండ్ ప్రాంగణంలోనే నిద్రకు ఉపక్రమించింది.
ఇది గమనించిన బీట్‌డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆమెను బెదిరించి అక్కడే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడే బైక్ పార్కింగ్ వర్కర్లుగా ఉన్న రాకేష్, రమేష్ అనే మరో ఇద్దరు యువకులు సదరు మహిళ ను బలత్కరించారు. సమీపంలోనే డ్యూటీలో ఉన్న హోంగార్డు నాగేంద్రం ఇది చూస్తూ కూడా వారిని నిలువరించకపోయాడు. ఇదిలాఉండగా గురువా రం ఉదయం బాధితురాలు స్థానికుల సహాయంతో పోలీస్‌స్టేషన్‌లో తనపై జ రిగిన దారుణంపై కొత్తకోట పోలీసులకు ఫిర్యాదుచేసింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగికదాడికి పాల్పడిన కానిస్టేబుల్ శ్రీనివాసులు, అతనికి సహకరించిన హోంగార్డు నాగేంద్రంలను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ డి.నాగేంద్రకుమార్ ప్రకటించారు. మరో ఇద్దరు నిందితులు రాకేష్, రమేష్‌లను అరెస్టు చేశామని, ఈ నలుగురిపై నిర్భయ చట్టం 376 డీ కింద కేసునమోదు చేశామని వెల్లడించారు.
నిర్భయ చట్టం కింద కేసు: ఎస్పీ
మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ డి. నాగేంద్రకుమార్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఆయన కొత్తకోటలో బాధితురాలిని పరామర్శించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..నిర్భయ చట్టం కింద నిందితులకు 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై లైంగికదాడులను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకచర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో వనపర్తి డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మహేశ్వర్‌రావు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
మహిళపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలు ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం కొత్తకోట చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చ ట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పలువురు పోలీసులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నిర్భయచట్టం ప్రకారం నిందితులకు యావ జ్జీవ జైలు శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొత్తకోట చౌరస్తాలో, బైపాస్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో మహిళా, విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసునమోదుచేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
అబలపై అఘాయిత్యం
Published Fri, Sep 20 2013 3:44 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement