అనంతపురం:గుంతకల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం కలకలం రేపింది. గురువారం తాడిపత్రిలో నలుగురు చోటా క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ నలుగురూ వెంకటశివుడు యాదవ్ అలియాస్ నందపాడు శివ అలియాస్ శివయ్య యాదవ్‌ను ప్రధాన బుకీగా వెల్లడించారని పోలీసులు ప్రకటించారు. వెంకటశివుడు యాదవ్ గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోండటం.. ఇదే సమయంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడటంతో సంచలనం రేపింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు వెంకటశివుడు యాదవ్ సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతో గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ ఇప్పించాలని నాలుగేళ్లుగా యనమలపై ఆయన ఒత్తిడి తెస్తున్నారు.
వాటి ఫలితంగా గుంతకల్లు నుంచి టీడీపీ టికెట్ వెంకటశివుడు యాదవ్‌కు దక్కడం ఖాయమనే భావన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఇటీవల గుంతకల్లు నుంచి వెంకటశివుడు యాదవ్‌కు టికెట్ దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ప్రకటించడమే అందుకు తార్కాణం. టీడీపీ టికెట్ తనకే దక్కే అవకాశాలు ఉండటంతో వెంకటశివుడు యాదవ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాడిపత్రిలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. తాడిపత్రిలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతోన్న సుదర్శన్, జగన్‌మోహన్, జనార్దనరెడ్డి, శ్రీరాములును అరెస్టుచేసి వారి నుంచి నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. నలుగురు నిందితులను విచారణ చేయగా ప్రొద్దుటూరుకు చెందిన నరసింహులు, నందపాడుకు చెందిన శివయాదవ్(శివ)తోపాటు జీవరత్నంరెడ్డి, శివుడు, నూర్, లక్ష్మినారాయణ, జావేద్, లోకేశ్వరరెడ్డి, ధనేశ్వర్‌రెడ్డి, దిలీప్‌కుమార్‌రెడ్డి, ఉమాపతినాయుడు ప్రధాన బుకీలుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
నిందితులు చెప్పిన మేరకు ప్రధాన బుకీల బ్యాంకు అకౌంట్ నెంబర్‌లను.. లావాదేవీలను పరిశీలించి, నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందుకు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వెంకటశివుడు యాదవ్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని ఓ ప్రజాప్రతినిధి సహకారం కోరినట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి తాడిపత్రి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.